Begin typing your search above and press return to search.

పొలం పనులతో కేసీఆర్ బిజీ బిజీ

ఇక, తాజాగా గాయం నుంచి పూర్తిగా తాను కోలుకోవడంతో వ్యవసాయంపై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   24 Jun 2024 10:30 AM GMT
పొలం పనులతో కేసీఆర్ బిజీ బిజీ
X

తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చిన బీఆర్ఎస్....లోక్ సభ ఎన్నికలలో మాత్రం చతికిలబడింది. కనీసం ఒక్క స్థానం కూడా గెలవలేకపోవడం కేసీఆర్ కు షాకిచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంపై ఫోకస్ పెట్టారు. సరికొత్త పంటలు, విధానాలతో వ్యవసాయం చేయడంలో కేసీఆర్ బిజీ అయ్యారు. స్వతహాగానే రైతు అయిన కేసీఆర్...ఖాళీ సమయాల్లో తన పొలంలో కాయగూరలు పండించడం హాబీగా పెట్టుకున్నారు.

సీఎంగా బిజీగా ఉన్నా...వ్యవసాయానికి ఎంతో కొంత సమయం కేటాయించేవారు. ఈ క్రమంలోనే గతంలో వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ పసుపు, వెల్లుల్లి, ఆలుగడ్డలు, క్యారెట్, క్యాప్సికం వంటి పంటలను పండించారు. తాను పంటలు పండిస్తున్నానని కేసీఆర్ గతంలో స్వయంగా చెప్పారు. ఇటీవల మోకాలి ఆపరేషన్ తర్వా త కోలుకున్న కేసీఆర్...పుచ్చకాయ, బొప్పాయి పంటలకు సంబంధించి ఓ విత్తనాల షాపు యజమానితో మాట్లాడిన ఆడియో వైరల్ గా కూడా మారింది.

ఇక, తాజాగా గాయం నుంచి పూర్తిగా తాను కోలుకోవడంతో వ్యవసాయంపై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలు కూడా ముగియడంతో ఇప్పుడు తనకు కాస్త ఖాళీ సమయం దొరికిందని కేసీఆర్ భావిస్తున్నారట. బొప్పాయితో పాటు ఆర్గానిక్ పద్ధతిలో మరిన్ని కాయగూరలు, పంటలు పండించేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారట. ఈ క్రమంలోనే కొత్త కొత్త వరి వంగడాలను తెచ్చి పొలంలో కేసీఆర్ నాట్లు వేయించారని తెలుస్తోంది.

షుగర్ ఫ్రీ రైస్ కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇక, ఉద్యాన పంటలు, సీజన్ తో సంబంధం లేకుండా దొరికే పండ్లు, కూరగాయలు, ఆర్గానిక్ కూరగాయల సాగుపై కేసీఆర్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఇందుకోసం కేసీఆర్ పక్కాగా తన పొలంలో భూసార పరీక్షలు కూడా చేయించారట. సారవంతమైన భూమి ఎక్కడ ఉంది అనే అంశంపై తన పనివారికి అవగాహన కూడా కల్పించినట్టుగా తెలుస్తోంది.

తేలికపాటి వర్షాలతో సైతం పంటలు పండించే విధానంపై కూడా కేసీఆర్ దృష్టి సారించారట. ఇటీవల పొలం గట్టుపై కేసీఆర్ కూర్చుని తన పంటలను పరిశీలిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఫార్మర్ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఫార్మర్ గా కూడా మారారని సోషల్ మీడియాలో టాక్ వస్తుంది.