ట్యాపింగ్ పై నోరిప్పనున్న కేసీఆర్.. ఏం చెబుతారోననే టెన్షన్?
ట్యాపింగ్ గనుక నిజమే అయితే టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం చర్యలుంటాయని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది.
By: Tupaki Desk | 7 April 2024 11:03 AM GMTతెలంగాణ ఆవిర్భావం నుంచి దాదాపు పదేళ్లు ఏకధాటిగా పాలించిన బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లిన పదో రోజు నుంచే కష్టాలను ఎదుర్కొంటోంది. మొన్నటికి మొన్న అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం స్కాంలో అరెస్టయి తిహాడ్ జైలుకు వెళ్లారు. ఇక పార్టీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల జంపింగ్.. మునిపాలిటీలు, కార్పొరేషన్లలో అవిశ్వాసాలు, సీనియర్ నాయకుల గుడ్ బై సాధారణం అయిపోయాయి.. ఇవేకాక ప్రభుత్వంలో ఉండగా చేసిన తప్పిదాలు మెడకు చుట్టుకుంటున్నాయి. కాళేశ్వరం ఏ ముహూర్తాన కుంగిందో అదే బీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి పునాది అయింది. ఇక నాటి పాలనలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ అత్యంత సంచలనం రేపుతోంది. ట్యాపింగ్ గనుక నిజమే అయితే టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం చర్యలుంటాయని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది.
ఆరోపణలన్నీ ఆయనపైనే..
పోలీస్ ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగుసుకుని.. బీఆర్ఎస్ పాలనలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ లో ఆరోపణలన్నీ ఇప్పటివరకు మాజీ మంత్రి, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ లక్ష్యంగానే వచ్చాయి. తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులను నియమించుకుని మరీ ఈ చర్యకు పాల్పడ్డారని విమర్శలు చేస్తున్నారు. ట్యాపింగ్ ద్వారానే కేటీఆర్ చాలా విషయాల్లో తలదూర్చారని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అయితే, ఆయన ఐటీ శాఖ మంత్రిగా కూడా కొనసాగడంతో వీటికి బలం చేకూరుతోంది. కాగా, ఈ ఆరోపణలన్నిటినీ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
ప్రభుత్వాధినేత సంగతి?
కేటీఆర్ అంటే మంత్రిగా ఉన్నారు.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధినేతగా వ్యవహరించిన కేసీఆర్ పేరు మాత్రం ట్యాపింగ్ ఆరోపణల్లో రెండో స్థానంలో ఉంది. అయితే, ఇప్పుడు కేసీఆర్ ట్యాపింగ్ ఆరోపణలపై నోరు విప్పనున్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన రెండు రోజుల్లో సమాధానం ఇస్తానని ప్రకటించారు. ఈ లెక్కన ఆది, సోమవారాల్లో ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ ప్రకటన పోలీసులు వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ‘మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొత్తం చెబుతాను’ అని కూడా ఆయన అనడంతో వారిలో టెన్షన్ మొదలైంది.
ప్రెస్‌మీట్‌లో ఏం చెబుతారు..? ట్యాపింగ్‌కు సంబంధించి కేసీఆర్ వద్ద ఎలాంటి సమాచారం ఉంది..? ఎవరి పేర్లయినా బయట పెడతారా? అన్న చర్చ కొనసాగుతోంది. కేసీఆర్ హయాంలో అనురాగ్ శర్మ, మహేందర్రెడ్డి, అంజనీకుమార్ డీజీపీలుగా కొనసాగారు. ఇంటలిజెన్స్ చీఫ్శివథర్రెడ్డి, నవీన్చంద్, కొన్ని రోజుల ఇన్‌చార్జిగా ప్రభాకర్రావు, అనిల్ కుమార్ పనిచేశారు. ఎస్ఐబీ చీఫ్‌గా సజ్జనార్, ఆ తర్వాత ప్రభాకర్రావు బాధ్యతలు నిర్వహించారు. ఇపుడు మీడియా సమావేశంలో ఎవరి పేర్లు బయటకు వస్తాయన్నటెన్షన్ పట్టుకుంది. తప్పంతా పోలీసుల మీదకు నెట్టేసి మాటల గారడీతో నమ్మిస్తారనే ప్రచారం జరుతోంది. తన హయాంలో పని చేసిన పోలీసు బాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే స్కెచ్ వేశాడని అధికారులు అనుకుంటున్నారు. 2015లో జరిగిన ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడి అధికారులను ఇబ్బందుల్లోకి పడేస్తాడా అనే టాక్ నడుస్తోంది.
ఇక ట్యాపింగ్ కేసులో అరెస్టయిన రాధాకిషన్రావు ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీమ్ అంటూ తన వాంగ్మూలంలో పలు మార్లు ప్రస్తావించారు.