Begin typing your search above and press return to search.

హైకోర్టు కాకుంటే సుప్రీం వెళతానంటున్న కేసీఆర్!

తెలంగాణ డెవలప్ మెంట్ కోసం తమ పార్టీతో కలిసి వచ్చే గులాబీ ఎమ్మెల్యేలకు స్వాగతం పలుకుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Jun 2024 4:14 AM GMT
హైకోర్టు కాకుంటే సుప్రీం వెళతానంటున్న కేసీఆర్!
X

మనం చేస్తే రాజకీయం..అదే ఎదుటోడు చేస్తే మాత్రం న్యాయం కోసం కోర్టులకు వెళదామంటూ పెద్ద పెద్ద మాటలు. గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పుడు న్యాయపోరాటానికి తెగ ఆసక్తిని చూపిస్తున్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ చేతిలో ఉన్న అధికారం చేజారి.. హస్తగతం కావటం తెలిసిందే. అధికార బదిలీ అనంతరం.. గతంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఎలాంటి పనులు చేశారో.. ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శిస్తున్న రేవంత్. తెలంగాణ డెవలప్ మెంట్ కోసం తమ పార్టీతో కలిసి వచ్చే గులాబీ ఎమ్మెల్యేలకు స్వాగతం పలుకుతున్న సంగతి తెలిసిందే.

చూస్తుండగానే అరడజనుకు పైగా ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్న రేవంత్.. రానున్న రోజుల్లో ఈ జోరును మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ఓకే. ఇలాంటి వేళ.. కేసీఆర్ రియాక్షన్ ఏమిటి? అంటే.. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టును ఆశ్రయించిన ఆయన.. అక్కడ తీర్పు తాను అనుకున్నట్లు రాని పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. చట్ట ప్రకారం ఎంత దూరమైనా వెళదామని.. తనను కలుస్తున్న ఎమ్మెల్యేలకు హితబోధ చేస్తున్న కేసీఆర్.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ నీతి ఏమైందన్నది ప్రశ్న.

తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. ప్రత్యర్థి పార్టీలన్నవి లేకుండా చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆయన చేసిన పనులు.. ప్రోత్సహించిన ఫిరాయింపులకు ముందుగా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తామని చెబుతున్న కేసీఆర్..గతంలో తాను చేసిన ఆ పనులకు ఎలాంటి సమాధానం చెబుతారు? ఈ విషయాల్ని ప్రజలు అడిగినా కేసీఆర్ సమాధానం చెప్పేందుకు ఇష్టపడరు. అందుకే.. కోర్టుకు వెళ్లే ఆయన్ను.. అక్కడి న్యాయమూర్తులైనా సూటిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.

ఇప్పుడు ఏదైతే తప్పు అని గగ్గోలు పెడుతూ.. న్యాయం చేయండి మహాప్రభూ అంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారో.. గతంలో అలాంటి పనులే పెద్ద ఎత్తున చేసిన కేసీఆర్ తాను చేసిన పనులకు బాధ్యత వహించాల్సి ఉంది. అప్పుడు మాత్రమే ఆయన తనకు న్యాయం చేయాలని కోర్టులను కోరే వీలుంది. తాను చేస్తే ధర్మం.. ఎదుటోడు చేస్తే అన్యాయం అన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్ మైండ్ సెట్ ను ముందు సెట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కోర్టులు ఒక అడుగు ముందుకు వేస్తే.. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించే అధినేతల తీరుకు చెక్ పడుతుందని చెప్పాలి.