రేవంత్ ను కేసీఆర్ ఫాలో అవుతున్నారా? ఆయనలా మాట్లాడటం ఏంటి?
ఇందులో భాగంగా ఆయన పలు మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
By: Tupaki Desk | 24 April 2024 4:25 AM GMTఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. తిరుగులేని అధికారం పదేళ్లు చలాయించిన తర్వాత పవర్ చేజారితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది గులాబీ బాస్ కేసీఆర్ ను చూస్తే అర్థమవుతుంది. ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో ఎవరికి అందుబాటులో ఉండని ఆయన.. ఇప్పుడు అందుకు భిన్నంగా తనను తాను ఫ్రూవ్ చేసుకోవటానికి.. తనకు భారీ ప్రచారం లభించటానికి వీలుగా ఆయన అన్నీ మాథ్యమాల్ని వాడేసేందుకు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఆయన పలు మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
దీనికి సంబంధించి టీజర్లు కొన్ని కట్ అవుతున్నాయి. తాజాగా అలాంటిదే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం ఒక ప్రముఖ తెలుగు టీవీ చానల్ కు వెళ్లిన కేసీఆర్.. సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇవ్వటం.. పలు అంశాల మీద తన అభిప్రాయాన్ని వెల్లడించిన ఆయన.. తనకు అవకాశం ఉన్నా లేకున్నా.. ఏదోఒక విషయం మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురి పెట్టటం కనిపించింది. నాలుగు నెలల రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనకు ప్రభుత్వాన్ని నడపటం చేతకావట్లేదంటూ నిప్పులు చెరిగారు. ఇలా.. రేవంత్ ను టార్గెట్ చేసిన కేసీఆర్.. మరో చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాత్రం ఆ మధ్య రేవంత్ నోటి నుంచి వచ్చిన తరహాలోనే కేసీఆర్ మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరుస టీవీ చానళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఒకప్రముఖ మీడియా సంస్థ అధినేతకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తాను ముఖ్యమంత్రిని అవుతానన్న ధీమాను వ్యక్తం చేయటమే కాదు.. తాను సీఎం హోదాలో సదరు మీడియా అధినేతకే మొదటి ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పటం తెలిసిందే. అందుకు తగ్గట్లే.. తాను అధికారంలోకి వచ్చి.. ముఖ్యమంత్రి హోదాలో సదరు చానల్ కు వెళ్లిన రేవంత్ రెడ్డి.. ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వటం తెలిసిందే.
సరిగ్గా ఇదే తీరును ప్రదర్శించారు కేసీఆర్. ఒక జాతీయ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానని.. తాను సీఎం హోదాలో మళ్లీ వచ్చి.. ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పటం.. దానికి సంబంధించిన క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సీఎంగా ఉన్నప్పుడు ఎవరికి అందుబాటులో ఉండని కేసీఆర్.. ఇప్పుడు మాత్రం ఇంటర్వ్యూల కోసం టీవీ చానళ్లకు వెళ్లటం.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక టీవీ చానల్ కు వెళ్లి మరీ.. ఇంటర్వ్యూ ఇస్తాననటం చూస్తే.. రేవంత్ మాటల ప్రభావం కేసీఆర్ మీద కూడా పడిందన్న మాట వినిపిస్తోంది. అందుకే.. రేవంత్ తరహాలో కసీఆర్ రియాక్టు అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.