మానస పుత్రికపై నాడు అసెంబ్లీలో.. నేడు టీవీలో కేసీఆర్
అధికారం కోల్పోయిన మూడు నెలల్లోనే బీఆర్ఎస్ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది
By: Tupaki Desk | 14 March 2024 1:30 PM GMTఅధికారం కోల్పోయిన మూడు నెలల్లోనే బీఆర్ఎస్ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఓవైపు నాయకులు ఒకరివెంట ఒకరు పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. మరోవైపు పదేళ్ల పాలనలో తప్పులు జరిగాయంటూ కొత్త ప్రభుత్వం వెంటాడుతోంది. ఇంకోవైపు లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఇప్పడు ముప్పేట దాడిలో ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు అధినేత కేసీఆర్ ఒక్కరే ఆ పార్టీకి ఉన్న ఆయుధం.
కలల ప్రాజెక్టు
నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఉవ్వెత్తున సాగిన తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేలా చేసింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తొలి విడత పాలనలోనే కాళేశ్వరం అంటూ పెద్ద ప్రాజెక్టును మొదలుపెట్టారు. 2018 ఎన్నికలకు ముందే ఇది సాకారం కావడంతో నదినే ఎత్తిపోశారంటూ ఎన్నో ప్రశంసలు దక్కాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కాళేశ్వరం కూడా ఒక కారణమే అని చెప్పొచ్చు. అన్నిటికిమించి కాళేశ్వరం కేసీఆర్ మానస పుత్రిక.
ఈసారి ఎన్నికలకు వచ్చేసరికి
గత ఎన్నికల విజయానికి కామధేనువుగా మారిన కాళేశ్వరం ఈ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ కు గుదిబండగా మారింది. సరిగ్గా ఎన్నికల సమయంలో కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ పిల్లర్ కుంగింది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ లోపాలు బయటపడ్డాయి. ఓ విధంగా ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణంగా మారాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం కారాలు మిరియాలు
కాళేశ్వరంపై మొదటినుంచి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక విచారణకు సిద్ధమైంది. రెండు రోజుల కిందట కేబినెట్ లో రిటైర్డ్ జడ్డిని నియమించింది. అంతకుముందు శాసన సభ్యులను కాళేశ్వరం సందర్శనకు తీసుకెళ్లింది. ప్రతిగా బీఆర్ఎస్ సభ్యులు, నేతలు కూడా కాళేశ్వరం వెళ్లారు. వీటన్నిటి మధ్యనే జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సభ్యులు పర్యటన చేపట్టారు.
టీవీ ముందుకు రానున్న కేసీఆర్
కాళేశ్వరంపై ముప్పేట ఆరోపణలు ఎదుర్కొంటున్నకేసీఆర్ ఇక రంగంలోకి నేరుగా దిగే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. సీఎం హోదాలో కాళేశ్వరంపై అసెంబ్లీలో ఎంతో ఘనంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన ఆయన.. ప్రతిపక్ష నేతగా ఇప్పుడు టీవీల ముందుకువచ్చి అసలేం జరిగిందో చెప్పే ప్రయత్నం చేయనున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ కరీంనగర్ కదనభేరిలో మంగళవారం వెల్లడించారు. మరి.. మీడియా ముందుకు కాకుండా.. టీవీల ముందుకు వస్తున్న ఆయన ఏం చెబుతారో చూద్దాం..