Begin typing your search above and press return to search.

కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీ అందుకేనా?

ఈసారి గజ్వేల్‌ తోపాటు ఉమ్మడి నిజామాబాద్‌ లోని కామారెడ్డి నుంచి కూడా పోటీకి సిద్ధమవుతున్నారు.

By:  Tupaki Desk   |   21 Aug 2023 2:51 PM GMT
కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీ అందుకేనా?
X

ఉత్కంఠకు తెరదించుతూ తెలంగాణలో 115 అసెంబ్లీ స్థానాలకు బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా నాలుగు స్థానాలు.. జనగాం, గోషామహల్, నాంపల్లి, నర్సాపూర్‌ స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రస్తుతం సిట్టింగులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు స్థానాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో ఎస్సీ, ఎస్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలే ఎక్కువ.

కాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈసారి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి గజ్వేల్‌ తోపాటు ఉమ్మడి నిజామాబాద్‌ లోని కామారెడ్డి నుంచి కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కేసీఆర్‌ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో ఆయన పోటీ చేసే స్థానాలు గజ్వేల్, కామారెడ్డిగా పేర్కొనడం గమనార్హం. ముందు జాగ్రత్త చర్యగా గజ్వేల్‌ తో పాటు మరో స్థానం కూడా నుంచి సీఎం కేసీఆర్‌ పోటీ చేయాలని పార్టీలో ముఖ్య నేతలు సూచించిన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

కాగా ఈసారి కేసీఆర్‌ ను ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు లక్ష్యంగా ఎంచుకున్నారు. కేసీఆర్‌ గజ్వేల్‌ లో పోటీ చేస్తే ఆయనపై ఈసారి తాను పోటీకి దిగుతానని బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ ఇప్పటికే సవాల్‌ విసిరారు. ఇప్పటికే గజ్వేల్‌ ను లక్ష్యంగా చేసుకుని అక్కడ పర్యటించారు కూడా.

అలాగే పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కూడా కేసీఆర్‌ ను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని కంకణం కట్టుకున్నారు. గత ఎన్నికల్లో తనను కొడంగల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినందుకు గజ్వేల్‌ లో కేసీఆర్‌ ను ఓడించి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్‌ కూడా గజ్వేల్‌ లో పోటీ చేస్తానని ప్రకటించారు.

మరోవైపు కేసీఆర్‌ కు గజ్వేల్‌ సురక్షితం కాదని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలు గజ్వేల్‌ లో బలంగా ఉండటం, సామాజిక సమీకరణాలు తదితర కారణాలతో ఈసారి కేసీఆర్‌ కు ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని టాక్‌. అందుకే మధ్యేమార్గంగా గజ్వేల్‌ తోపాటు కామారెడ్డిని ఎంచుకున్నారని చెబుతున్నారు.

మరోవైపు కామారెడ్డి ఓ రకంగా భౌగోళికంగా కీలకమైన స్థానంలో ఉంది. ఉత్తర తెలంగాణలో పార్టీకి ఉన్న ఊపు కొనసాగాలంటే కామారెడ్డి నుంచి పోటీ చేయడం సరైన నిర్ణయం అని ఆయన భావించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్‌ విజయం సాధించారు.

కాగా గజ్వేల్‌ లో ఓడిపోతాననే భయంతోనే కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీ చేయనున్నారని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ ఎద్దేవా చేశారు. కామారెడ్డిలో ఎవరు పోటీ చేసినా తానే గెలుస్తానని షబ్బీర్‌ అలీ సవాల్‌ విసిరారు. వైఎస్సార్‌ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత –చేవెళ్ల పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగు నీరు వచ్చేదన్నారు. కామారెడ్డిలో ఎన్ని ఎకరాలకు సాగు నీళ్ళు ఇచ్చారో చెప్పి కేసీఆర్‌ నామినేషన్‌ వేయాలని షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌ ఎందుకు పారిపోతున్నారో చెప్పాలన్నారు.