బిగ్ బ్రేకింగ్... కేసీఆర్ కీలక ప్రకటన!
అయితే... ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇప్పటివరకూ కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు!
By: Tupaki Desk | 26 Jan 2024 12:09 PM GMTలోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మాదిరే లోక్ సభ ఎన్నికల్లోను సత్తా చాటాలని రేవంత్ & కో భావిస్తుండగా... లోక్ సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటి "బీఆరెస్స్ ఈజ్ బ్యాక్" అనిపించుకోవాలని కేసీఆర్ & కో భావిస్తున్నారు. అయితే... ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇప్పటివరకూ కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు!
అత్యంత ఆసక్తికరంగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ కీ హాజరుకాలేకపోయారు. తుంటికి ఆపరేషన్ తో విశ్రాంతిలో ఉన్నారు. అయితే... ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగేందుకు ముహూర్తం ఖరారైందని తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్... అందులో భాగంగా పార్టీ వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక ప్రకటన చేశారు.
అవును... త్వరలోనే ప్రజల్లోకి వస్తానని బీఆరెస్స్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. తాజాగా... ఆయన అధ్యక్షతన ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరిగిన బీఆరెస్స్ పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సమయంలో బీఆరెస్స్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని, ఎవరి అవసరం లేకుండా గట్టిగా పోరాడగలదని, పోరాడదాం అని పిలుపునిచ్చారు.
ఇక ఈ నెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో... బీఆరెస్స్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ, లోక్ సభ ఎంపీలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్... అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆరెస్స్ మాత్రమేనని.. ఈ క్రమంలో పార్లమెంట్ లో బీఆరెస్స్ గళం బలంగా వినిపించాలని.. ప్రధానంగా రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలని తెలిపారు. ఇదే సమయంలో... విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి గట్టిగా ప్రశ్నించాలని కేసీఆర్ సూచించారు. ఈ సందర్భంగానే త్వరలో తాను జనాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. .