Begin typing your search above and press return to search.

కొత్త ప్రభుత్వం విషయంలో కేసీఆర్ జోస్యం... సంకీర్ణంలో బీఆరెస్స్ కీలకం!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆరెస్స్ ప్రచారాలతో హోరెత్తించేస్తుంది.

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:12 AM GMT
కొత్త ప్రభుత్వం విషయంలో కేసీఆర్  జోస్యం... సంకీర్ణంలో బీఆరెస్స్  కీలకం!
X

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆరెస్స్ ప్రచారాలతో హోరెత్తించేస్తుంది. ఇందులో భాగంగా ప్రధానంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ముగ్గురూ నలుమూలలా ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ఈ సమయంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న కేసీఆర్... తాజాగా రాబోయే కొత్త ప్రభుత్వం, అందులో బీఆరెస్స్ పాత్ర, సంకీర్ణంలో కీలక భూమిక వంటి విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... తాజాగా తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. రెండు బలమైన జాతీయ పార్టీలతో పోరాడుతున్న క్రమంలో రాబోయే రోజుల్లో కేంద్రంలో వచ్చేది.. ప్రాంతీయ పార్టీల సంకీర్ణ ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్‌ జోస్యం చెప్పారు. ఫలితంగా 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో బీఆరెస్స్ కీలకం కానుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో... కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

వాస్తవంగా టీఆరెస్స్ ను బీఆరెస్స్ గా మార్చడానికి కారణమే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ కలలు గనడమే అనేది తెలిసిన విషయమే! అయితే అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో... “పార్టీ పేరైతే సులువుగానే మార్చగలిగారు కానీ...” అనే కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వినిపించాయి! ఈ సమయంలో మహారాష్ట్రపై కేసీఆర్ ఎక్కువగా దృష్టి సారించడం, వరుస సభలు నిర్వహించడం తెలిసిందే.

ఈ సమయంలో తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరుగుతున్న వేళ... మరోపక్క అటు కాంగ్రెస్, బీజేపీల నుంచి జాతీయ స్థాయిలో కీలక నేతలు ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కేంద్రంలో అయితే ఎన్డీఏ.. లేకపోతే ఇం.డి.యా. కూటములు అధికారంలోకి వస్తాయనే చర్చ సమయంలో... కేసీఆర్ సరికొత్త టాపిక్ తెరపైకి తెచ్చారు.

వాస్తవానికి అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటముల్లో ఏ కూటమికీ చెందకుండా దక్షిణాదిలో ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీలు వైసీపీ, బీఆరెస్స్ మాత్రమే!! ఇక దేశవ్యాప్తంగా చూస్తే ఎన్డీఏ కూటమిలో 35పార్టీలు ఉన్నాయని బీజేపీ చెబుతుండగా... తమ కూటమిలో 26 పార్టీలు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక మిగిలిన వాటితో సంకీర్ణమా.. లేక, ఉన్న వారిని చీల్చడం ద్వారా సంకీర్ణమా అనేది కేసీఆర్ కే తెలియాలనేది పరిశీలకుల కామెంట్ గా ఉంది!

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా అదిలాబాద్ సభలో కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇందులో భాగంగా “కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా” అని ప్రజలను ప్రశ్నించిన కేసీఆర్... అనంతరం, “రైతుబంధు కావాలా.. రాబంధు కావాలా.. ఒక్కసారి ఆలోచించండి” అని సూచించారు.

ఇదే సమయంలో తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకు ఎందుకు ఓటేయాలని ప్రజలను ప్రశ్నించిన కేసీఆర్... 24 గంటల కరెంటు వద్దు, 3 గంటలు చాలని పీసీసీ అధ్యక్షుడే అంటున్నారని మండిపడ్డారు. ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణకు ప్రయోజనం ఉండదని.. ఈ రాష్ట్రంలో మరోసారి బీఆరెస్స్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతుందని అన్నారు. మంది మాట విని ఆగమైతే ఐదేళ్లపాటు కష్టాలు పాలవుతారని తెలిపారు!

దీంతో... అటు కాంగ్రెస్ తోనూ, ఇటు బీజేపీతోనూ పోరాడుతున్న కేసీఆర్... 2024లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ రాబోతుందని వ్యాఖ్యానించడం తాజా ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రం మాత్రమేనా.. లేక, ఆ దిశగా తెరవెనుక పావులు కదుపుతున్నారా అన్నది ఆసక్తిగా నెలకొంది!