Begin typing your search above and press return to search.

కారు.. సారు.. పదహారు కాదు.. ఈసారికి పన్నెండేనట

అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఓటమి షాక్ నేపథ్యంలో గతంలో మాదిరి సారు కారు పదహారు కాకుండా పన్నెండు సీట్లు ఖాయమంటూ కేసీఆర్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 March 2024 5:22 AM GMT
కారు.. సారు.. పదహారు కాదు.. ఈసారికి పన్నెండేనట
X

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మనసులో ఎలా ఉన్నా.. మాటల్లో మాత్రం అదిరే కాన్ఫిడెన్స్ తో మాట్లాడే విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ లెక్కనే వేరుగా ఉంటుందని చెప్పాలి. గత లోక్ సభ ఎన్నికల్లో సారు.. కారు.. పదహారు అంటూ ఆయన పరివారం ప్రచార మోత ఒక రేంజ్ లో మోగించటం తెలిసిందే. నిజానికి అప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి మాంచి ఊపులో ఉన్న సారుకు తెలంగాణ ఓటర్లు షాకివ్వటం తెలిసిందే.

కట్ చేస్తే.. ఈ మధ్యనే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలై.. ఆ షాక్ నుంచి పూర్తిగా బయటకు రాని వేళలో వచ్చి పడుతున్న లోక్ సభ ఎన్నికల విషయంలో కేసీఆర్ నోటి నుంచి వస్తున్న కాన్ఫిడెన్సు మాటలు ఆసక్తికరంగా మారాయి. గత ఎన్నికల్లో మాదిరి బడాయి మాటలకు పోకుండా.. పదహారు జోలికి వెళ్లని ఆయన.. రిథమ్ లేనప్పటికీ పన్నెండు స్థానాలకు పరిమితమయ్యారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండటం.. అందులో మజ్లిస్ ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్ ను పక్కన పెట్టేసి.. మిగిలిన అన్నీ స్థానాల్లోనూ తమదే విజయమని ప్రచారం చేసుకోవటం తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఓటమి షాక్ నేపథ్యంలో గతంలో మాదిరి సారు కారు పదహారు కాకుండా పన్నెండు సీట్లు ఖాయమంటూ కేసీఆర్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకింత ధీమా అంటే.. రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న తప్పులే అని ఆయన చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బీఆర్ఎస్ మెరుగైన ఓట్లను.. ఓట్ల శాతాన్ని సొంతం చేసుకుంటుందన్న వాదనను కేసీఆర్ వినిపిస్తున్నారు.

సారు మాటల్ని పక్కన పెడితే.. నిజంగానే అంత సీన్ ఉందా? అంటే లేదన్న పెదవి విరుపు మాట గులాబీ నేతల నుంచే రావటం గమనార్హం. దీనికి కారణం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా రేవంత్ ను శక్తివంతమైన నేతగా భావించకపోవటం.. ఆయన ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందన్న భావనను తరచూ వ్యక్తం చేయటం ఆ పార్టీకి నెగిటివ్ గా మారింది.

ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ కు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా అదే పనిగా విమర్శల దాడి చేస్తున్న వైనం వేలెత్తి చూపేలా చేస్తోంది. మరి ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ నోటి నుంచి వస్తున్న మాటలు పార్టీకి నష్టం వాటిల్లేలా చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని తన ఇంట్లో జహీరాబాద్ ఎంపీ స్థానానికి చెందిన నేతలతో రివ్యూ చేసిన సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతున్నా.. పాలన ముందుకు సాగటం లేదని.. అవగాహన లేమితో రాష్ట్రానికి నష్టం వాటిల్లేలా వరుస తప్పులు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. అదే సమయంలో పార్టీ నుంచి బయటకు వెళుతున్న వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. తన నలభై ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాల్ని ఎదుర్కొన్న ఘటనలు ఉన్నాయని చెబుతున్న కేసీఆర్ ఒక పాయింట్ మర్చిపోతున్నారంటున్నారు. గతంలో ఎప్పుడూ ఆయన చేతికి అధికారం రాలేదని.. అలా వచ్చిన తర్వాత పవర్ పోవటం జరగలేదని గుర్తు చేస్తున్నారు.

"పదేళ్లు అధికారంలో ఉండి.. ఆయన ఏమిటన్నది అందరూ చూసిన తర్వాత.. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఆయన తీరును ప్రజలు గమనిస్తున్నారు. వాస్తవాన్ని గుర్తించకుండా తనదైన ప్రపంచంలో ఉండి.. తన అంచనాల్ని నేతల మీద రుద్దినంత మాత్రాన ఆశించిన ఫలితాలు వస్తాయా?" అన్న అనుమానాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేళ.. డజను స్థానాలు తర్వాత మూడు నాలుగు స్థానాలు వస్తే అదే గొప్పన్నది గులాబీ శ్రేణుల నోటి నుంచి వస్తున్న మాట. తుది ఫలితం ఎలా ఉంటుందన్నది మరికొంత కాలం వెయిట్ చేస్తే సరి.