కేసీఆర్ మెజారిటీ ఎంత? బెట్టింగులు షురూ!
ఇదే విధంగా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ మెజారిటీపై తొలిసారి బెట్టింగుల పర్వం ప్రారంభ మైందనే గుసగుస వినిపిస్తోంది.
By: Tupaki Desk | 10 Nov 2023 5:53 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ మెజారిటీపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి క్రికెట్ బెట్టింగుల గురించి విని ఉంటాం. కానీ, ఇటీవల కాలంలో ఎన్నికల్లో తలపడుతున్న నాయకుల మెజారిటీపైనా బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. గతంలో హుజూరాబాద్ బైపోల్‌లో ఈటల రాజేందర్‌పై బెట్టింగుల పర్వం నడిచింది. ఇక, 2019లో జరిగిన ఏపీ ఎన్నికల్లో పరిటాల రవి వారసుడు శ్రీరాం పోటీ చేసిన 'రాప్తాడు' నియోజకవర్గంలోనూ బెట్టింగుల విషయం తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే.
ఇదే విధంగా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ మెజారిటీపై తొలిసారి బెట్టింగుల పర్వం ప్రారంభ మైందనే గుసగుస వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సారథి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ కాగా, రెండోది కామారెడ్డి. రెండో నియోజకవర్గం విషయంపై పెద్దగా చర్చలేదు. కానీ, గజ్వేల్‌పై మాత్రం అంచనాలు పెరుగుతున్నాయి. ఆయన మెజారిటీ ఎంత వస్తుంది? అనే చర్చ సాగుతోంది.
గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై బీజేపీ నేత, గతంలో బీఆర్ ఎస్‌లో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ బీజేపీ తరఫున తలపడుతున్నారు. పైగా ఈటల ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గం హుజారాబాద్ కన్నా ఎక్కువగా.. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించాలనే లక్ష్యంతో వ్యూహ ప్రతివ్యూహాలు, సామాజిక వర్గం సమీకరణలు, కుల సంఘాల ఐక్యతకు.. ఈటల ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇక్కడి నేతలతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గం తనకు కొత్తకాదని.. కూడా ఈటల తన ప్రచారంలో దంచి కొడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏమేరకు ఈటల దూకుడును తట్టుకుని విజయం దక్కించుకుంటారు? అనే చర్చ వైపు సాగుతుండగానే, మరోవైపు.. ఆయన గెలుపుపై ధీమా ఉన్నా.. మెజారిటీ ఎంత? అనేది ప్రధానంగా చర్చకు వస్తోంది. 2014 ఎన్నికల్లో కేసీఆర్ ఇక్కడ కేవలం 19 వేల పైచిలుకు ఓట్లతో గెలుపు గుర్రం ఎక్కారు.
2018 ముందస్తు పోరులో మాత్రం 58 వేల పైచిలుకు ఓట్లతో విజయం దక్కించుకున్నారు. అయితే.. అప్పట్లో వంటేరు ప్రతాప్‌రెడ్డిపై కేసీఆర్ పోటీ చేశారు. కానీ, ఇప్పుడు ఫైర్ బ్రాండ్, మాస్ లీడర్ అయిన ఈటలపై తలపడుతుండడంతో కేసీఆర్ మెజారిటీ ఎంత దక్కించుకుంటారనేది ఆసక్తిగా మారింది. దీంతోనే ఈ మెజారిటీపై బెట్టింగుల పర్వం జోరుగా సోగుతోందని అంటున్నారు పరిశీలకులు.