Begin typing your search above and press return to search.

వారికోసమే కొత్త స్నేహం చేస్తున్న కేసీఆర్

కేసీయార్ చెప్పిందంతా నిజమే అయితే మరి బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ?

By:  Tupaki Desk   |   6 March 2024 7:01 AM GMT
వారికోసమే కొత్త స్నేహం చేస్తున్న కేసీఆర్
X

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయటానికి బీఆర్ఎస్ అధినేత కేసీయార్ భయపడుతున్నారా ? పార్టీలో జరుగుతున్న తాజా డెవలప్మెంట్లను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే సడెన్ గా బీఎస్పీతో కేసీయార్ పొత్తు పెట్టుకోవటమే. రెండురోజుల క్రితంవరకు కూడా కాంగ్రెస్ పైన జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయిందని పార్టీ సమీక్షల్లో చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని పదేపదే చెప్పారు. కేసీయార్ చెప్పిందంతా నిజమే అయితే మరి బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ?

ఒకవైపు బీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. మరోవైపు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆరుగురు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 11 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో సిట్టింగుల్లో ఎంతమందికి టికెట్లిస్తారో తెలీదు. ఈ నేపధ్యంలోనే సడెన్ గా కేసీయార్ తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. వీళ్ళమధ్య పొత్తుకుదిరింది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం ఆర్ ఎస్ ప్రవీణ్ మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు సమాచారం. పొత్తు ఫైనల్ చేయడానికి కేసీయార్ తొందరలో ఉత్తర ప్రదేశ్ కు వెళ్ళి బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అవటానికి రెడీ అవుతున్నారు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే బీఎస్పీకి ఒకటి లేదా రెండు పార్లమెంటు సీట్లను కేసీయార్ కేటాయించే అవకాశముంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని దృష్టిలో పెట్టుకునే బీఎస్పీతో పొత్తుకు కేసీయార్ రెడీ అయినట్లు అర్ధమవుతోంది. ఎలాగంటే మొత్తం 19 ఎస్సీ సీట్లలో బీఆర్ఎస్ గెలిచింది మూడు సీట్లు అలంపూర్, స్టేషన్ ఘన్ పూర్, చేవెళ్ళ స్ధానాల్లో మాత్రమే. అంటే 19 ఎస్సీ సీట్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గెలిచింది కేవలం మూడు సీట్లు మాత్రమే అంటే ఎంతటి పూర్ రిజల్టో అర్ధమవుతోంది. అందుకే ఎస్సీ ఓట్లను మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ వైపుకు మళ్ళించుకోవటంలో భాగాగంగానే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నట్లున్నారు. లేకపోతే ఎస్సీ ఓట్లు, సీట్లన్నీ కాంగ్రెస్ ఖాతాలోనే పడతాయనే టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. కాంగ్రెస్ కు ఎస్సీ ఓట్లు పడకుండా అడ్డుకోవాలన్నదే కేసీయార్ వ్యూహంగా కనబడుతోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.