బిగ్ బ్రేకింగ్... ఆస్పత్రి బెడ్ పై నుంచి కేసీఆర్ కీలక సందేశం!
ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ ఒక వీడియో సందేశం ఇచ్చారు. ఇందులో భాగంగా తాను బాగానే ఉన్నానని, దయచేసి తనను చూసేందుకు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని, వందల మంది పేషెంట్స్ కి అసౌకర్యం కల్పించొద్దని తెలిపారు.
By: Tupaki Desk | 12 Dec 2023 11:45 AM GMTఎర్రవల్లి నివాసంలోని బాత్ రూంలో గురువారం అర్ధరాత్రి జారిపడటంతో కేసీఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా కేసీఆర్ ను పరామర్శించడానికి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు భారీగా తరలివస్తున్నారు. దీంతో తాజాగా కేసీఆర్ ఒక వీడియో సందేశం ఇచ్చారు.
అవును... సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కేసీఆర్ ని చూడటానికి పార్టీలకు అతీతంగా భారీగా నాయకులు తరలివస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టితో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, బీఆరెస్స్ నేతలు తరలి వచ్చారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కేసీఆర్ ని పరామర్శించి వెళ్లారు.
ఈయనతోపాటు కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరున్న ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి యశోద ఆస్పత్రికి వచ్చిన కేసీఆర్ ని పరామర్శించారు. ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ ఒక వీడియో సందేశం ఇచ్చారు. ఇందులో భాగంగా తాను బాగానే ఉన్నానని, దయచేసి తనను చూసేందుకు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని, వందల మంది పేషెంట్స్ కి అసౌకర్యం కల్పించొద్దని తెలిపారు.
తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు వీడియో విడుదల చేసిన ఆయన... తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని ప్రజల మధ్యకు వస్తానని వెల్లడించారు. ఈ సమయంలో అప్పటివరకూ అంతా సంయమనం పాటించాలని కేసీఆర్ కోరారు.
ప్రత్యేకంగా ఈ రోజు వందల వేల సంఖ్యలో ఆస్పత్రికి తనను చూసేందుకు అభిమానులు రావడం వల్ల మిగిలిన వారికి ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. తాను బయటకు రావడానికి మరో 10 రోజులైనా పడుతుందని.. ఆలోపు ఎక్కువ మందిని కలిసినా, బయటకు వచ్చినా ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాధం ఉందని, అదే జరిగితే కొన్ని నెలల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి రావొచ్చని ఈ సందర్భంగా ప్రజలకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
అందులో భాగంగా... యశోద ఆస్పత్రికి ఎవరూ రావొద్దని, తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మనవల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకున్నారు. ఈ క్రమంలో... తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరంతో చేతులు జోడించి కేసీఆర్ వేడుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రత్యేకంగా యశోద ఆస్పత్రినుంచి వీడియోను విడుదల చేసారు.