కేసీఆర్ కు తుంటి గాయం.. గతంలోనూ ఓసారి.. అప్పట్లో ఏం జరిగిందంటే?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాయపడ్డారు. ఫాం హౌస్ లో గురువారం అర్ధరాత్రి కాలుజారి పడడంతో తుంటి విరిగింది
By: Tupaki Desk | 8 Dec 2023 6:49 AM GMTబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాయపడ్డారు. ఫాం హౌస్ లో గురువారం అర్ధరాత్రి కాలుజారి పడడంతో తుంటి విరిగింది. దీంతో ఆయన సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఫలితాలు వెల్లడైన ఆదివారం సాయంత్రమే నేరుగా ఎర్రవల్లిలోని ఫాం హౌజ్ కు వెళ్లిన కేసీఆర్.. ఐదు రోజులుగా అక్కడే ఉంటున్నారు. ఆయనను అక్కడే పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. ఆ తర్వాత కేసీఆర్ స్వగ్రామం చింతమడక వాసులు ఎర్రవల్లి ఫాం హౌస్ కు వచ్చి మద్దతు తెలిపారు. మరోవైపు కేసీఆర్ హైదరాబాద్ లో నివాసం వెదుకులాట పనిలో ఉన్నారు. ఇప్పటికే ఉన్న నందినగర్ లోని ఇల్లు సరిపోదని భావిస్తూ, విశాలమైన ఇంటికోసం వెదుకుతున్నారు. ఈలోగానే గురువారం అర్ధరాత్రి ఆయన ఫాంహౌస్ లోని ఇంట్లో కిందపడి గాయపడ్డారు.
గతంలో చికిత్స పొందిన యశోదలో
మొన్నటివరకు సీఎంగా పనిచేసిన కేసీఆర్.. ప్రగతి భవన్ సమీపంలోనే ఉండే యశోద ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. దాదాపు రెండేళ్ల కిందట ఆయనకు యశోదలోనే యాంజియోగ్రామ్ చేసినట్లుగా కథనాలు వచ్చాయి. కాగా, ఇప్పుడు కూడా సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
కేసీఆర్‌కు తుంటి మార్పిడి ఆపరేషన్.. అప్‌డేట్ ఇచ్చిన వైద్యులు
ఈ రోజు(శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు సర్జరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో కేసీఆర్ 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు.
భద్రత పెంచండి: సీఎం ఆదేశం
కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు అందజేయాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి ఆదేశించారు. అదేవిధంగా మాజీ సీఎం కావడంతో యశోద ఆసుపత్రి వద్ద భద్రతను పెంచాలని పోలీసులను ఆదేశించారు. దీంతో 250 మంది పోలీసులతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా.. కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.