Begin typing your search above and press return to search.

కమీషన్ కు కేసీఆర్ సంచలన లేఖ!

''జ్యూడిషియల్‌ కమిషన్‌ చైర్మన్‌గా వచ్చిన మీరు పత్రికా విలేఖరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది

By:  Tupaki Desk   |   15 Jun 2024 8:01 AM GMT
కమీషన్ కు కేసీఆర్ సంచలన లేఖ!
X

తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కు సంబంధించిన అంశాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమీషన్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన లేఖ రాశారు. విచారణ కమీషన్ సాంప్రదాయాలకు విరుద్దంగా విచారణ పూర్తికాక ముందే మీడియా సమావేశం నిర్వహించడం, తన పేరును ప్రస్తావించడం, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సమాధానం ఇవ్వడానికి సమయం అడిగితే దానిని ఏదో దయతలచినట్లుగా మాట్లాడడంపై కేసీఆర్ లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన మీ తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా ఉందని, విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ లేఖ సంక్షిప్తంగా

''జ్యూడిషియల్‌ కమిషన్‌ చైర్మన్‌గా వచ్చిన మీరు పత్రికా విలేఖరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. నిజానికి మీ పిలుపు మేరకు, లోక్‌సభ ఎన్నికల తర్వాత, 2024 జూలై 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వయిరీ కమిషన్‌ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక ముందే మీరు విలేఖరుల సమావేశం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి, పదేండ్లు పరిపాలించిన నా పేరు ప్రస్తావించడం, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా దయతలచి ఇచ్చినట్టుగా మాట్లాడటం నాకెంతో బాధ కలిగించింది. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరు పక్షాల మధ్య ఒక వివాదం తలెత్తినప్పుడు, మధ్యవర్తిగా నిలిచి, అసలు నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన విధి. అన్ని విషయాలను, అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి, పూర్తి నిర్దారణకు వచ్చిన తర్వాత, డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌తో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని. కానీ మీ వ్యవహార శైలి అట్లా లేదని చెప్పడానికి చింతిస్తున్నాను. ఎంక్వయిరీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు చేసిన ఏ వ్యాఖ్యను గమనించినా, మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్టు, ఇక ఆ తప్పు వల్ల జరిగిన నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉన్నట్టు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసి రిటైరైనప్పటికీ మీ తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. విచారణ పూర్తి కాకముందే ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వయిరీ కమిషన్‌ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.'' అని కోరారు.