కూతురు జైల్లో ఉన్నా.. కేసీఆర్ వెళ్లి పరామర్శించలేదెందుకు?
అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు స్పందించే తీరు ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు.
By: Tupaki Desk | 27 July 2024 6:25 AM GMTఅనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు స్పందించే తీరు ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. కలలో కూడా ఊహించని రీతిలో రియాక్టు అయ్యే టాలెంట్ గులాబీ బాస్ కేసీఆర్ సొంతమని చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్లే ముందు.. కొసరు అంశాల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కేసు ఏదైనా కానీ చంద్రబాబు జైలుకు వెళ్లటం తెలిసిందే. జైల్లో ఉన్న వేళలో ఆయన్ను పరామర్శించేందుకు సతీమణి.. కుమారుడుతో పాటు కోడలు.. ఇతర కీలక కుటుంబ సభ్యులు కూడా ఆయన్ను పరామర్శించారు. అప్పట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించి రావటం తెలిసిందే.
చంద్రబాబు ఎపిసోడ్ ఇలా ఉంటే. . రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన వాళ్లు సైతం పవర్ ఉన్నప్పుడు ఒకలా.. పవర్ చేజారిన తర్వాత ఎదుర్కొనే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. గులాబీ బాస్ కేసీఆర్ విషయానికి వస్తే.. ఎన్నికల్లో ఘోర పరాజయం.. అధికారం చేజారటం.. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు కావటం తెలిసిందే.
అది మొదలు మరో వారంలో.. ఇంకో వారంలో అంటూ ఎప్పటికప్పుడు కవిత బెయిల్ మీద ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ అవేమీ వర్కువుట్ కాలేదు. నెలలు గడుస్తున్నా.. జైల్లో ఉన్న కవిత బెయిల్ మీద బయటకు రాని దుస్థితి. ఇలాంటి వేళలో.. ఆమెకు ధైర్యం చెప్పటానికి.. నైతికంగా తాను వెంటే ఉంటానన్న సంకేతాల్ని ఇవ్వటం అవసరం. కానీ.. అదేం సిత్రమో కానీ జైల్లో ఉన్న కవితను పరామర్శించేందుకు కేసీఆర్ ఇప్పటివరకు వెళ్లింది లేదు. ఇదే విషయాన్ని ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి.
మొన్నీ మధ్యనే కవిత ప్రస్తావన తీసుకొచ్చిన కేసీఆర్.. తన ఆవేదనను పంచుకున్నారు. మరి.. అంతలా వేదన చెందుతున్న కేసీఆర్ తీహార్ జైల్లో ఉన్న కవితను ఎందుకు పరామర్శించరు? అన్నది ప్రశ్న. ఏమైనా.. కన్నకూతురు తీవ్రమైన ఆరోపణలతో జైల్లో ఉన్న వేళ.. మాజీ సీఎం హోదాలో పలుకరించి.. పరామర్శ చేసి వచ్చేయొచ్చు. బెయిల్ తెచ్చుకోవటంలో ఎదురుదెబ్బలు తింటున్న కవితకు ఊరటనిచ్చేలా కేసీఆర్ వెళ్లి ఉండాల్సిందంటున్నారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ తీరు చర్చనీయాంశంగా మారింది.