Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ వ‌ల్లే 60 ఏళ్ల గోస‌ప‌డ్డాం: ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేసీఆర్ కామెంట్స్‌

ఉన్న తెలంగాణ పోగొట్టింది కాంగ్రెస్ పార్టీనేన‌ని తెలంగాణ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ చేసిన ఆ ఒక్క ప‌నివ‌ల్లే 60 ఏళ్ల‌పాటు గోస‌ప‌డ్డామ‌ని చెప్పారు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 1:06 PM GMT
కాంగ్రెస్ వ‌ల్లే 60 ఏళ్ల గోస‌ప‌డ్డాం: ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేసీఆర్ కామెంట్స్‌
X

ఉన్న తెలంగాణ పోగొట్టింది కాంగ్రెస్ పార్టీనేన‌ని తెలంగాణ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ చేసిన ఆ ఒక్క ప‌నివ‌ల్లే 60 ఏళ్ల‌పాటు గోస‌ప‌డ్డామ‌ని చెప్పారు. చావు నోట్లో త‌ల పెట్టి తెలంగాణ‌ను సాధించామ‌ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. ఇక మ‌న బ‌తుకులు అంతే.. అని హెచ్చ‌రించారు. తాజాగా జ‌డ్చ‌ర్ల‌లో నిర్వ‌హించిన బీఆర్ ఎస్ ఎన్నికల ప్ర‌చార స‌భ ప్ర‌జాశీర్వాద స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. మహబూబ్‌నగర్‌తో తనకున్న అనుంబంధాన్ని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు.

కాంగ్రెస్‌ చేసిన పొరపాటు వల్ల 60 ఏళ్లు గోసపడ్డామ‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉమ్మ‌డి ఏపీకి ముందు ఉన్న తెలంగాణను పోగొట్టింది కాంగ్రెస్‌ పార్టీయేన‌ని, అప్ప‌టి ఆంధ్ర నేత‌ల‌తో కుమ్మ‌క్క‌యి.. తెలంగాణ‌కు అన్యాయం చేశార‌ని అన్నారు. "తెలంగాణను ఎవరూ ఇవ్వలేదు.. పోరాటం చేసి సాధించుకున్నాం. చావునోట్లో తలకాయపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించా" అని కేసీఆర్ వెల్ల‌డించారు.

దాదాపు తొమ్మిదేళ్ల‌పాటు పోరాటం చేసిన తర్వాత పాలమూరుకు అనుమతులు వచ్చాయన్నారు. నార్లాపూర్‌, ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్‌ రిజర్వాయర్లు, టన్నెల్స్‌ పూర్తయ్యాయని వివ‌రించారు. రాబోయే 3..4 నెలల్లో అన్ని రిజర్వాయర్లలో బ్రహ్మాండంగా నీళ్లను చూడబోతున్నామ‌ని కేసీఆర్ చెప్పారు. పాలమూరులో కరవు అనేది పోతదని చెప్పారు. ఉద్దండాపూర్‌ ప్రాజెక్టు పూర్తయితే జడ్చర్ల నియోజకవర్గంలోని 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని వివ‌రించారు కరువు అనేది మనవైపు కన్నెత్తి కూడా చూడదు. పాలమూరు పాలుకారే జిల్లాగా మారుతుందని కేసీఆర్‌ అన్నారు.

కృష్ణా జ‌లాల‌పై..

కృష్ణా జ‌లాల్లో తెలంగాణ హ‌క్కులు సాధించుకునేందుకు ఎంతో పోరాటం చేశామ‌ని కేసీఆర్ వివ‌రించారు. తాను మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించామ‌ని చెప్పారు. కొందరు పాలకులు పాలమూరును దత్తత తీసుకున్నారు కానీ.. చేసిందేమీ లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. శ్రీశైలం ఎవ‌రి జాగీరూ కాద‌ని.. ప‌రోక్షంగా ఏపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.