Begin typing your search above and press return to search.

ఒక్క లేఖతో తేల్చేసిన కేసీఆర్ !

దీంతో పాటు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఈ నెల 15వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   16 Jun 2024 5:11 AM GMT
ఒక్క లేఖతో తేల్చేసిన కేసీఆర్ !
X

తెలంగాణలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్‌ నర్సింహారెడ్డి నేతృత్వంలో ఈ ఏడాది మార్చి 14న ఏకసభ్య విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ యాక్ట్‌- 1952 కింద ఏర్పాటైన ఈ కమిషన్‌ ఇప్పటికే విచారణను ప్రారంభించి, తెలంగాణ విద్యుత్తు సంస్థలకు చెందిన దాదాపు 25 మంది అధికారులను, మాజీ అధికారులను విచారించింది. దీంతో పాటు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఈ నెల 15వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ‘న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్‌ ఏర్పాటు చట్ట విరుద్ధం. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు ప్రభుత్వానికి సూచించకుండా, విచారణ కమిషన్‌ బాధ్యతలు స్వీకరించడం విచారకరం. చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించడమే కాకుండా, అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే సమావేశం నిర్వహించి, పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. చివరికి న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీల అధికార పరిధి గురించి చట్టంలో ఏముందో కూడా గమనించకుండా మీరు మాట్లాడారు’ అంటూ కేసీఆర్‌ 12 పేజీల సుదీర్ఘ లేఖతో అసలు ఈ కమీషన్ చెల్లదు అంటూ కొట్టిపడేశారు. ఈ విచారణ నుండి గౌరవప్రదంగా తప్పుకోవాలని జస్టిస్‌ నర్సింహారెడ్డికి విన్నవించడం విశేషం. విచారణ కమీషన్ అంశాన్ని కేసీఆర్ ఒక్క లేఖతో తేల్చేయడం గమనార్హం.

అయితే జస్టిస్ నరసింహారెడ్డి 2020 సంవత్సరంలో హెసీయూ ఛాన్స్ లర్ గా, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్శిటీ భూములను ఆయన భార్య ఇందిర 311 గజాల భూమి ఆక్రమించారని గుర్తించి యూనివర్శిటీ సెక్యూరిటీ ఫిర్యాదు చేయగా అక్కడికి వెళ్లిన అధికారులకు అక్కడ అప్పటికే గోడ నిర్మించిన ఆనవాళ్లు కనిపించాయి. దాంతో ఆ అక్రమ ప్రహారీ గోడను ప్రభుత్వం కూల్చివేసింది.

ఈ ఆక్రమణలను ప్రశ్నిస్తూ అప్పటి కాంగ్రెస్ నేతలు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ తదితరులు వెళ్లి కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు. ఇప్పుడు అదే నరసింహారెడ్డిని విద్యుత్ పై విచారణ కమీషన్ చైర్మన్ గా నియమించడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.