అవును.. ఇవన్నీ కేసీఆర్ మాటలే!
ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న వేళ.. తమకున్న సానుకూలతల గురించి గొప్పగా చెప్పుకోవాలి.
By: Tupaki Desk | 19 April 2024 4:26 AM GMTప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న వేళ.. తమకున్న సానుకూలతల గురించి గొప్పగా చెప్పుకోవాలి. సాధారణంగా ఎవరైనా అనుసరించే వ్యూహాన్ని తాజాగా కేసీఆర్ ఫాలో అయ్యారు. కాకుంటే ఆయన నోటి నుంచి వచ్చే మాట ఎంత పక్కాగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధాన్ని సైతం అదే నిజమన్న భావన కలిగేలా మాట్లాడటంలో కేసీఆర్ కున్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా జరిగిన బీఆర్ఎస్ విస్త్రత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ చెలరేగిపోయారు. సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
రేవంత్ సర్కారుకు మూడిందన్న ఆయన.. అందుకు పార్లమెంట్ ఎన్నికల అనంతరం ముహుర్తంగా చెప్పుకొచ్చారు. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున 8 మంది ఎంపీలు గెలుస్తారంటూ జోస్యం చెప్పిన ఆయన.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రేవంత్ సర్కారు కొలువు తీరిన నాటి నుంచి అదే పనిగా.. రేవంత్ సర్కారుది ముణ్ణ్నాళ్ల ముచ్చటగా చెప్పే కేసీఆర్.. ఈ మధ్యన కాస్త టోన్ మార్చటం తెలిసిందే. తాజాగా మాత్రం మళ్లీ పాల పల్లవినే అందుకున్నారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారంతా బాధ పడుతున్నట్లు చెప్పిన ఆయన.. ఒక సీనియర్ నేత తనతో మాట్లాడుతూ ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారంటూ.. ‘‘104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీవాళ్లు ప్రభుత్వాన్ని కూల్చటానికి కుట్రలు చేవారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ను బీజేపీ వాళ్లు బతకనిస్తారా? రేవంత్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా అని బీఆర్ఎస్ వదిలేసి కాంగ్రెస్ లోకి వెళితే.. అక్కడంతా బీజేపీ కథ నడుస్తోందని నాతో సదరు నాయకుడు వాపోయాడు. ఇప్పటికిప్పుడు 20 మంది ఎమ్మెల్యేల్ని తీసుకొని రావాలా సార్? అంటూ నన్ను సంప్రదించారు. కానీ.. నేనే వారిని ఇప్పుడే వద్దని వారించా’’ అంటూ చెప్పిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తొలి నాటి నుంచి ప్రభుత్వం ఎక్కువ కాలం మనలేదంటూ కేసీఆర్.. కేటీఆర్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఎక్కువ కాలం ఉండదంటూ వారిద్దరూ తరచూ చేసే వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం తప్పు పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఈ తరహా వ్యాఖ్యలు సరికావంటున్నారు. తమ అధినాయకత్వం మాటలు ప్రజల్లో తప్పుడు సంకేతాలకు కారణంగా మారుతుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తుంటే.. అందుకు భిన్నంగా కేసీఆర్.. కేటీఆర్ లు మాత్రం భిన్నంగా మాట్లాడటం గమనార్హం.
ఇదిలా ఉంటే..తాజాగా జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై ఆసక్తికర అంచనాల్ని వెల్లడించారు కేసీఆర్. ఇప్పటివరకున్న పరిస్థితుల్లో 8 స్థానాల్లో బీఆర్ఎస్ గెలవనుందన్న కేసీఆర్.. మరో మూడింట్లో విజయవకాశాలు ఉన్నాయని చెప్పటం విశేషం. ఎందుకంటే.. ఒకట్రెండు స్థానాల్లో కూడా గెలుపు అవకాశాల మీద సందేహాలు నెలకొన్న వేళ.. అందుకు భిన్నంగా కేసీఆర్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఇటీవల వెలువడిన పలు పోల్ సర్వేల్లోనూ ఎక్కడా కూడా బీఆర్ఎస్ కు ఒకట్రెండుకు మించి సీట్లు గెలిచే అవకాశాల్లేవని స్పష్టం చేస్తున్న వేళలో.. సిత్రమైన మాటలతో కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ నోటి నుంచి తాజాగా వచ్చిన మాటలపై పలువురు వ్యంగ్యంగా రియాక్టు అవుతున్నారు.