Begin typing your search above and press return to search.

‘కారు’ను కాపాడేందుకు ‘కాలు’ బయటపెట్టనున్న ‘గులాబీ సారు’?

పదేళ్లు ఉద్యమ పార్టీగా.. రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, పదేళ్లు పాలక పార్టీగా తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన టీఆర్ఎస్-బీఆర్ఎస్ కు ఇలాంటి పరిస్థితి ఎపుడూ రాలేదు.

By:  Tupaki Desk   |   8 July 2024 7:34 AM GMT
‘కారు’ను కాపాడేందుకు ‘కాలు’ బయటపెట్టనున్న ‘గులాబీ సారు’?
X

26 మంది ఎమ్మెల్యేలను చీల్చడమే లక్ష్యంగా అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది.. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు.. లోక్ సభలో ఒక్క ఎంపీ కూడా లేరు.. రాజ్యసభ ఎంపీ రాజీనామా చేసేశారు.. ఎమ్మెల్సీలు రాత్రికి రాత్రే హస్తం గూటికి చేరారు.. ఇలా ఇంకా ఎందరు కారు దిగుతున్నారో.. దిగారో తెలియని పరిస్థితి. మొత్తానికి తెలంగాణల రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను బాగా బలహీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ మించి అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాదాపు నాలుగు నెలలుగా ఢిల్లీలో ఉన్నారు. తిహాడ్ జైలులో మూడు నెలలుగా ఉన్నారు. ఆమెకు బెయిల్ రావడమే లేదు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ కత్తులు నూరుతోంది. ఇన్ని కష్టాల మధ్య బీఆర్ఎస్ ను కాపాడుకోవడం అంటే ఏదైనా అద్భుతం జరగాలి.

ప్రజల్లోకి వెళ్తేనే పట్టు..

పదేళ్లు ఉద్యమ పార్టీగా.. రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, పదేళ్లు పాలక పార్టీగా తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన టీఆర్ఎస్-బీఆర్ఎస్ కు ఇలాంటి పరిస్థితి ఎపుడూ రాలేదు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు, వైఎస్ సీఎంలుగా ఉండగా కేసీఆర్ ఒక్కరే ధైర్యంగా ఎదుర్కొన్నారు. కానీ, ఇప్పుడు అలా కాదు. పాలనలో చేసిన తప్పులు, పార్టీ పరంగా తిప్పలు చుట్టుముట్టాయి. దీంతో బీఆర్ఎస్ భవిష్యత్ కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సమయంలోనే మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ప్రజలతో మమేకమయ్యేలా కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని సమాచారం.

ఫాంహౌస్ నుంచే మంత్రాంగం

కేసీఆర్ కొన్నాళ్ల నుంచి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ లోనే ఉంటున్నారు. అక్కడే అందరు నేతలను కలుస్తున్నారు. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలను అక్కడికే పిలిపించి మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేశారని సమాచారం. పార్టీ ముఖ్యులతో రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లుగా తెలిసింది. ఎమ్మెల్యేలు, నేతలు వెళ్లిపోయినా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేక ఉందని కేసీఆర్ చెబుతున్నారు. ప్రజల్లోనే తిరుగుబాటు మొదలైందని విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనను గుర్తుచేసుకుంటున్నారని సముదాయిస్తున్నారు.

పాదయాత్ర దిశగా అడుగులు

గతంలోలాగా కాలుకదపకుండా పని చక్కబెట్టే పరిస్థితి, పార్టీని కాపాడుకునే పరిస్థితి లేకపోడంతో కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగాలని చూస్తున్నారని సమాచారం. తద్వారా ప్రజల్లో సానుకూల సంకేతాలు పంపాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం పాదయాత్ర ఆలోచన చేస్తున్నారు. అయితే, తాను కాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయించాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ను వ్యతిరేకించి కాంగ్రెస్ కు ఓటు వేసిన నిరుద్యోగ యువత, సింగరేణి కార్మికుల్లోనూ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారని.. పాదయాత్ర ద్వారా వారి వద్దకు వెళ్తే మేలు జరుగుతుందని తలపోస్తున్నారు.కేటీఆర్ తో పాదయాత్ర గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మరి తుది నిర్ణయం..ముహూర్తంఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి.