పదేళ్ళలో కేసీఆర్ చెప్పింది ఎన్ని...చేసింది ఎన్ని...హరీష్ డ్రామా ..!
కానీ హరీష్ రావు లాంటి వారు మాత్రం ఊరుకోవడం లేదు. హామీలు అన్నీ అమలు చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఈ ఉడత ఊపులన్నీ ఎన్నికల కోసమే అంటున్నారు.
By: Tupaki Desk | 26 April 2024 9:36 AM GMTఉమ్మడి ఏపీ విభజన తరువాత కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఅర్ 2023 చివర వరకూ దాదాపుగా పదేళ్ల పాటు అధికారంలో కొనసాగారు. కేసీఆర్ రెండు సార్లు అధికారంలో ఉన్నపుడు ఆయన చెప్పిన వాటిని సక్రమంగా అమలు చేశారా అన్న చర్చ ఇపుడు సాగుతోంది. ఆయన అనేక సందర్భాలలో వివిధ సామాజిక వర్గాల వారికి కానీ లేక సగటు ప్రజానీకానికి కానీ ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
ఇక బీఆర్ ఎస్ పార్టీ రెండు ఎన్నికల మ్యానిఫేస్టోలను 2014, 2018లలో రిలీజ్ చేసింది వాటిలో నూటికి నూరు శాతం హామీలు అమలు చేశారా అన్న చర్చకు కూడా తెర తీస్తున్నారు. ఆనేక కీలక హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విపక్షాలు ఎపుడూ చెబుతూ ఉంటాయి. అలాగే నిరసనలు వ్యక్తం చేసి ఉద్యమాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి.
అవి బీదలకు డబుల్ బెడ్ రూం ప్లాట్స్ అయినా లేక ఇతర హామీలు అయినా కూడా కేసీఆర్ ప్రభుత్వం చెప్పినది మరిచిపోయిందని కూడా వెల్లువలా విమర్శలు వచ్చాయి. మరి ఆనాడు కేసీఆర్ దానికి బదులు ఏమి చెప్పారు అన్నదే ఇక్కడ ప్రశ్న. పేదల సంక్షేమం విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి వాటిని చాలా వరకూ నెరవేర్చలేదని అంటున్నారు.
అంటే పదేళ్ల సుదీర్ఘ కాలం అధికారంలో ఉండి కూడా చాలా హామీలను నెరవేర్చని కేసీఆర్ ప్రభుత్వం కేవలం నాలుగు నెలలు మాత్రమే అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పడి విమర్శలు చేయడమేమిటి అని అంతా అంటున్నారు. ఇది అధికారం తమ చేతుల నుంచి జారిపోయింది అన్న దుగ్ద బాధతో చేస్తున్న విమర్శలు తప్ప మరేమీ కావని అంటున్నారు.
ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చాక కుదురుగా ఉండేందుకు చూస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఖజానా పరిస్థితిని కూడా చూసుకుంటుంది. ఆర్ధికంగా వెసులుబాటుని కూడా చూసుకుంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తప్పు. కానీ కొంత టైం తీసుకుంటే తప్పేంటి అన్నది సగటు తెలంగాణా వాసుల నుంచి వస్తున్న ప్రశ్న.
ప్రజలు కోరి ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. హానీమూన్ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇంతలోనే అంతలేసి బండలు వేసి డూ ఆర్ డై అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు రోడ్ల మీదకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడం పైన చర్చ సాగుతోంది. ఇది ఉనికి కోసం బీఆర్ఎస్ నేత హరీష్ రావు వంటి వారు చేస్తున్న డ్రామా అని కూడా అంటున్న వారు ఉన్నారు.
హామీలు తీర్చాలి అంటే కొంత సమయం ఇవ్వాలి సంయమనం కూడా పాటించాలి. కానీ గద్దె ఎక్కిన మరుసటి రోజు నుంచే రాళ్ళు వేస్తున్నారు అంటే తట్టుకోలేని తనమే తప్ప అందులో ప్రజల బాగు ఏదీ లేదని అంటున్నారు. పైగా ప్రజల తరఫున అంటూ చేస్తున్న ఈ యాగీకి మద్దతు ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితి అంటున్నారు.
ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండడం కూడా హరీష్ రావు సహా కేసీఆర్ కుటుంబానికి మంటగా ఉంది అంటున్నారు. రేవంత్ రెడ్డి ఇంతలా ఎదిగిపోవడం తాము కలలో కూడా ఊహించని విధంగా విపక్షంలోకి చేరడం అసలు సహించలేకపోతున్నారు అని అంటున్నారు. అందుకే ఇలా రేవంత్ గద్దె ఎక్కగానే అలా కూలిపోతుంది ప్రభుత్వం అని చెబుతున్నారు.
ఇపుడు లోక్ సభ ఎన్నికలు ఉన్న వేళ హామీలు తీరుస్తారా అంటూ సవాల్ చేస్తున్నారు. రైతు రుణ మాఫీ మీద రాజీనామాకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు సవాల్ చేస్తున్నారు. ఆగస్ట్ నెలలోగా రుణ మాఫీ మొత్తం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను తప్పకుండా చేస్తాను అని హరీష్ రావు రాజీనామా లేఖ తన జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలని రేవంత్ కూడా ధీటుగా చెబుతున్నారు.
ఏది ఏమైనా ప్రజా తీర్పుని గౌరవించకుండా ఇలా వీరంగం వేయడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు గ్రహించడం లేదు అంటున్నారు. అంతే కాదు రేవంత్ రెడ్డి మాటల పట్ల జనంలో విశ్వాసం ఉంది. ఆయనకు కొంత టైం ఇవ్వాలని ప్రజలు అనుకుంటున్నారు.
కానీ హరీష్ రావు లాంటి వారు మాత్రం ఊరుకోవడం లేదు. హామీలు అన్నీ అమలు చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఈ ఉడత ఊపులన్నీ ఎన్నికల కోసమే అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన బీఆర్ఎస్ కి కనీసంగా నాలుగు ఎంపీ సీట్లు అయినా ఈసారి రాకపోతే భవిష్యత్తు అంధకారం అని విశ్లేషణలు ఉన్నాయి. దాంతోనే ఈ హడావుడి ఈ వీరంగాలు అని అంటున్నారు.