కేసీఆర్ పై ఎందుకు సానుభూతి లేదు?
చెరపకురా చెడేవు అంటారు. ఇతరుల మీద ఆరోపణలు చేసే ముందు మన పనులు కూడా ఆలోచించుకోవాలి.
By: Tupaki Desk | 30 March 2024 6:30 AM GMTచెరపకురా చెడేవు అంటారు. ఇతరుల మీద ఆరోపణలు చేసే ముందు మన పనులు కూడా ఆలోచించుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎదురే లేదని విర్రవీగితే ఇలాగే ఉంటుంది. ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ కు ఎదురవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారిని లాక్కున్న గులాబీ బాస్ ప్రస్తుతం అదే బాధను అనుభవిస్తున్నారు. తాను చేసిన పాపమే ప్రస్తుతం తనను దహిస్తోంది.
2019లో రెండోసారి అదికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ నేతలను పనిగట్టుకుని మరీ తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి కేసీఆర్ కు ఎదురుకావడం గమనార్హం. దానం నాగేందర్, కేశవరావు, కడియం శ్రీహరి ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. అయినా కేసీఆర్ పై కనీసం సానుభూతి కూడా చూపడం లేదు.
దశాబ్దం క్రితం ఉన్న పరిస్థితికి ఇప్పటి స్థితికి ఎంత తేడా ఉంది. అప్పుడు బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నేతలు వెళ్లేవారు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. అంటే సీన్ రివర్స్ అయింది. అందుకే దేన్ని కూడా తక్కువగా అంచనా వేయొద్దు. అప్పటి పాపమే ఇప్పుడు కేసీఆర్ ను దహిస్తోంది. దీంతో తమ నేతలను ఏం అనలేకపోతున్నారు. ఎందుకంటే అప్పుడు జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకుంటోంది కాంగ్రెస్. వీళ్లు ఏదైనా అంటే నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా అంటున్నారు.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాత్రం తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేస్తున్నారు. అప్పుడు కూడా ఇదే తరహాలో కాంగ్రెస్ వారు ఫిర్యాదు చేస్తే హేళన చేసిన వారు ఇప్పుడు అదే పని చేయడంపై కాంగ్రెస్ వారు కూడా విమర్శలు చేస్తున్నారు. కారు టైరు పంక్చర్ అవడంతో అందరు దిగిపోతున్నారు. కనీసం కేసీఆర్ ముఖం కూడా చూడటం లేదని బాధపడుతున్నారు.
ఇన్నాళ్లు పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే వదిలేసి పోవడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి కష్టకాలంలో అండగా ఉండాల్సిన నేతలు క్యూ కడుతూ కాంగ్రెస్ లో చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే నేతలంతా పార్టీని వదిలేస్తున్నారు. ప్రస్తుత గడ్డు పరిస్థితికి బీఆర్ఎస్ నేతల అనాలోచిత నిర్ణయాలే కారణమనే వాదనలు కూడా వస్తున్నాయి.