అనర్హత వేటు ఇప్పుడు గుర్తుకొచ్చిందా కేసీఆర్?
ఇప్పుడూ అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి నాయకులు వెళ్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ హవా నడుస్తోంది.
By: Tupaki Desk | 15 April 2024 5:30 PM GMTబీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చేపట్టిన చర్యలు, చేసిన పనులనే ఇప్పుడు వ్యతిరేకిస్తుండటమే అందుకు కారణం. అప్పుడు ధర్మాచౌక్‌ను రద్దు చేసిన కేసీఆర్.. మొన్ననేమో దీక్ష చేస్తా అన్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను భారీ ఎత్తున చేర్చుకున్న కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అయితే తప్పు పడుతున్నారు. అనర్హత వేటు తప్పదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణలో తొలిసారి జరిగిన 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి 63 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ 21, టీడీపీ 15, బీజేపీ 5, వైసీపీ 3 స్థానాల్లో గెలిచింది. అయితే ఆ ఎన్నికల్లో గెలుపుతో కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లోకి తీసుకున్నారు.
తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులనూ పార్టీలో చేర్చుకోవడంతో విమర్శలు వచ్చినా కేసీఆర్ తగ్గలేదు. టీడీపీ నాయకులను మొత్తం లాగేసుకున్న కేసీఆర్.. తెలంగాణలో ఆ పార్టీని ఖాళీ చేశారు. కాంగ్రెస్‌లోని కీలక నాయకులనూ కారెక్కించుకున్నారు. ఇక 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకట వీరయ్య, మెచ్చ నాగేశ్వర్ రావునూ కేసీఆర్ బీఆర్ఎస్‌లోకి తీసుకున్నారు.
అప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్, టీడీపీ డిమాండ్ చేశాయి. కానీ కేసీఆర్ మాత్రం రియాక్టవ్వలేదు. ఇప్పుడూ అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి నాయకులు వెళ్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ హవా నడుస్తోంది.
అయితే ఒకప్పుడు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లోకి చేరికలను ప్రోత్సహించిన కేసీఆర్.. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్తే మాత్రం ఖండించడం గమనార్హం. మరి ఇదే అనర్హత వేటు గతంలో గుర్తుకు రాలేదా కేసీఆర్ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.