కవిత అరెస్ట్ పై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్... కారణం అదేనంట!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 18 April 2024 1:49 PM GMTదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈడీని మోడీ ఫుల్ గా వాడేస్తున్నారంటూ విమర్శలు బలంగా బీఆరెస్స్ నుంచి వినిపించాయి! అయితే కవిత అరెస్ట్ పై ఇప్పటివరకూ కేసీఆర్ స్పందించలేదు కానీ... తాజాగా తొలిసారి స్పందించారు.
అవును.. తన కుమార్తె, బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత ఆరెస్ట్ పై కేసీఆర్ తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె అరెస్ట్ కు గల అసలు కారణం ఇదేనంటూ ఒక విషయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా.. కవితపై ఎలాంటి కేసూ లేదు.. అయినా కక్ష కట్టి అరెస్టు చేశారు అని చెప్పిన కేసీఆర్... నాడు బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ కు నోటీసులు పంపిన విషయంలో ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్ర పోలీసులు వెళ్లారు.. అందుకే మనపై కక్ష పెంచుకున్నారని వెల్లడించారు.
తాజాగా తెలంగాణ భవన్ లో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన కేసీఆర్... ఈ సందర్భంగా కవిత అరెస్ట్ తో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... నాడు 104 మంది బీఆరెస్స్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేశారని.. ఇప్పుడు 64 మంది ఉన్న కాంగ్రెస్ ను బ్రతకనిస్తారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం బీఆరెస్స్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వాళ్లు బాధపడుతున్నారని.. కాంగ్రెస్ లోనూ అంతా బీజేపీ కథే నడుస్తోందని.. ఆ పార్టీలోకి వెళ్లిన ఓ సీనియర్ నేత వాపోయారన్నారని తెలిపారు. ఇదే క్రమంలో... 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రమ్మంటారా అని.. సీనియర్ నేత ఒకరు తనతో అన్నారని.. అయితే వద్దని తానే చెప్పానని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా... పార్టీ శ్రేణులు ఎవరూ నీరసించాల్సిన అవసరం లేదని.. ఉద్యమ కాలంనాటి కేసీఆర్ ను మళ్లీ చూస్తారని.. రానున్న రోజులు మనవే అంటూ కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందని.. ఫలితంగా రాబోయే రోజులు ముమ్మాటికీ మనవేనంటూ కేసీఆర్ పేర్కొన్నారు.