Begin typing your search above and press return to search.

కేసీయార్ వర్సెస్ రేవంత్ రెడ్డి : రాజశ్యామల హోమం ఫలితం ఎవరికి...?

సీన్ కట్ చేస్తే ఇపుడు జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజశ్యామల హోమాన్ని శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 1:39 PM GMT
కేసీయార్ వర్సెస్ రేవంత్ రెడ్డి : రాజశ్యామల హోమం ఫలితం ఎవరికి...?
X

రాజశ్యామల అమ్మ వారు తనను కొలిచిన వారికి రాజ్యాధికారం కట్టబెడుతుంది అని ఆధ్యాత్మిక పరులు నమ్ముతారు. అమ్మవారి దయ ఉంటే చాలు సింహాసనం లో హాయిగా కూర్చుంటారు. అమ్మ వారిని భక్తిపూర్వకంగా కొలవాలి. ఆధునిక కాలంలో ఇటీవల రోజులలో రెండు తెలుగు రాష్ట్రాలలో రాజశ్యామల అమ్మ వారి మీద రాజకీయ జీవులకు భక్తి ప్రపత్తులు మెండుగా కలుగుతున్నాయి.

రెండవమారు సీఎం కావాలని కేసీయార్ 2018కి ముందు రాజశ్యామల హోమం చేయించారు. విశాఖ నుంచి శ్రీ శారదా పీఠాధిపతి ఆనాడు స్వయంగా వెళ్ళి మరీ ఈ యాగాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. దాని ఫలితం కేసీయార్ దక్కింది. రెండవమారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ మీదట ఏపీలో వైసీపీ అధినేత జగన్ కోసం రాజశ్యామల హోమం పీఠం ఆద్వర్యంలో చేపట్టారని ప్రచారం సాగింది. జగన్ కూడా సీఎం అయ్యారు.

ఆ మధ్య దేవాదాయ శాఖ ఆద్వర్యంలో విజయవాడలో రాజ శ్యామల అమ్మ వారితో సహా అనేక దేవతలను ఆరాధిస్తూ కొన్ని రోజుల పాటు యాగాన్ని నిర్వహించారు. మరోమారు అధికారం కోసమే వైసీపీ ఈ యాగాన్ని చేపడుతోంది అని విపక్షాలు అప్పట్లో విమర్శించాయి కూడా.

ఇక తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్న వేళ నవంబర్ నెల మొదట్లోనే కేసీయార్ విశాఖ శారదా పీఠాధిపతులను పిలిచి మరీ అయిదు రోజుల పాటు రాజశ్యామల అమ్మ వారి హోమాన్ని నిర్వహించారు. తన వ్యవసాయ క్షేత్రంలో కేసీయార్ కుటుంబ సమేతంగా ఈ యాగంలో పాల్గొన్నారు.

సీన్ కట్ చేస్తే ఇపుడు జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజశ్యామల హోమాన్ని శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు తన మనవడిని ఒడిలో కూర్చోబెట్టుకుని సతీసమేంతంగా రేవంత్ రెడ్డి ఈ హోమంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు.

కాంగ్రెస్ కి రాష్ట్రంలో గాలి బాగానే ఉంది. అన్నీ అనుకూలించి రాజశ్యామల అమ్మవారు కరుణిస్తే తాను సీఎం కావాలని ఆయన కోరుకుంటున్నారు అని అంటున్నారు. అందులో భాగంగానే మానవ ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం కోసం రాజశ్యామల అమ్మ వారి హోమాన్ని నిర్వహిస్తున్నారు అని అంటున్నారు.

ఇలా అటు కేసీయార్ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరూ రాజశ్యామల అమ్మ వారికి మొక్కుతున్నారు. ఇద్దరూ భక్తితో హోమాన్ని చేస్తున్నారు. మరి ఎవరికి ఫలితం దక్కుతుంది అన్నది చర్చగా ఉంది. అమ్మ వారి దయ ఎవరి మీద ఉంటే వారిదే సింహాసనం అని అంతా అనుకున్నా ఇప్పటిదాకా ఎవరో ఒక పార్టీ వారే అమ్మ వారి దీవెనలు కోరుకున్నారు. ఫలితాలు అందుకున్నారు. కానీ పోటా పోటీగా రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న ఇద్దరు అగ్ర నేతలు రెండు పార్టీలకు నాయకత్వం వహిస్తున్న వారు ఇలా రాజశ్యామల అమ్మ వారిని కొలవడం మాత్రం ఆధ్యాతిక పరులతో పాటు రాజకీయ నేతలనూ ఆలోచనలలో పడేస్తోంది.

అమ్మ దయ ఎవరి మీద ఉంటుంది అన్నది మాత్రం ఆసక్తిని రేపుతోంది. ఏపీలో చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటివరకూ ఇలాంటి యాగాలు హోమాలు ఎపుడూ చేసినట్లుగా ప్రచారంలోకి రాలేదు కానీ 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ కూడా ఇలాంటి యాగాలు చేయాలని చూస్తోంది అని అంటున్నారు. అపుడు రాజకీయాలు వర్సెస్ ఆధ్యాత్మికత అన్నట్లుగా సన్నివేశం మారుతుందేమో చూడాల్సి ఉంది.