ఓటర్లను కేసీయార్ భయపెడుతున్నారా ?
ఎన్నికల ప్రచార సభల్లో కేసీయార్ ఓటర్లను భయపెడుతున్నట్లే ఉన్నారు. ఓటర్లను భయంలోకి నెట్టి బీఆర్ఎస్ కు ఓట్లు వేయించుకోవటమే స్ట్రాటజీగా కనబడుతోంది.
By: Tupaki Desk | 4 Nov 2023 5:33 AM GMTఎన్నికల ప్రచార సభల్లో కేసీయార్ ఓటర్లను భయపెడుతున్నట్లే ఉన్నారు. ఓటర్లను భయంలోకి నెట్టి బీఆర్ఎస్ కు ఓట్లు వేయించుకోవటమే స్ట్రాటజీగా కనబడుతోంది. ఆర్మూరు, భైంసా, కోరుట్ల నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగసభల్లో మాట్లాడుతు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే రాష్ట్రంలో కరెంటు ఉండదని, ధరణి పోర్టల్ కూడా ఉండదని చెప్పారు. దాంతో రాష్ట్రం మళ్ళీ దశాబ్దాల వెనక్కు వెళ్ళిపోవటం ఖాయమని భయపెడుతున్నారు. కాంగ్రెస్ 50 ఏళ్ళల్లో చేయలేని పనులను తమ ప్రభుత్వం 9 ఏళ్ళల్లో చేసిందన్నారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కేసీయార్ గొప్పగా చెప్పుకుంటున్న ధరణి పోర్టల్ లో ఎన్నో లోపాలున్నాయని చాలామంది చెబుతున్నారు. రైతుల సమస్యలకు ధరణి పోర్టల్ సంజీవని లాగ పనిచేస్తున్నట్లు కేసీయార్, కేటీయార్,హరీష్ రావు చెప్పుకుంటున్నారు. అయితే అదంతా అబద్ధాలేననే ఆరోపణలు వినబడుతున్నాయి. దాని నిర్వహణలో ఎన్నో తప్పులున్నాయని, పనితీరులో కూడా చాలా మైనసులున్నట్లు బయటపడింది. కాకపోతే ప్రతిపక్షాల చేతకానితనం వల్ల బీఆర్ఎస్ అదే పోర్టల్ తో నెట్టుకొచ్చేస్తోంది. ధరణినే అద్భుతంగా చిత్రీకరిస్తోంది.
ధరణిని రద్దుచేస్తామని కాకుండా లోపాలను సవరిస్తామని, పోర్టల్ ఉపయోగాన్ని మరింతగా మెరుగుపరుస్తామని చెప్పకుండా రద్దుచేస్తామని చెప్పటమే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన తప్పు. సరే ధరణి నిర్వహణలో కాంగ్రెస్ లోనే మిశ్రమ స్పందనలున్నాయని అందరికీ తెలిసిందే. ఇక కరెంటు విషయానికి వస్తే ఈ విషయంలో కూడా కేసీయార్ అండ్ కో అబద్ధాలు చెబుతున్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నారా లేదా అన్నది పక్కన పెట్టేస్తే ఇళ్ళకు మాత్రం అందటంలేదు.
హైదరాబాద్ లోనే చాలా ప్రాంతాల్లో ప్రతిరోజు ఏదో కారణంతో కరెంటు పోతునే ఉంది. కరెంటు తీగలపై చెట్లకొమ్మలు పడ్డాయని, మైన్ టెనెన్స్ అని ఏదో కారణంతో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతునే ఉన్నాయి. మరి ప్రతిరోజు కొమ్మలు పడటం ఏమిటో, మైన్ టెనెన్స్ ఏమిటో అధికారులకే తెలియాలి. హైదరాబాద్ పరిధిలోనే రెగ్యులర్ గా కరెంటు పోతుంటే ఇక జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు సరఫరా ఎలాగుంటుందో. మొత్తానికి జనాలను భయపెట్టి కేసీయార్ ఓట్లు వేయించుకోవాలని అనుకుంటున్నది మాత్రం వాస్తవమని అర్ధమైపోతోంది.