Begin typing your search above and press return to search.

ఫాలో ఫాలో స్టాలిన్ అంటున్న కేసీఆర్ !

అంతేనా రెండు సార్లు తెలంగాణాకు సీఎం గా అయి పూర్తిగా రాజకీయ ఆధిపత్యం చలాయించారు.

By:  Tupaki Desk   |   15 Aug 2024 8:30 AM GMT
ఫాలో ఫాలో స్టాలిన్ అంటున్న కేసీఆర్ !
X

కేసీఅర్ రాజకీయ ఉద్దండుడు. ఆయన ఒంటి చేత్తో తెలంగాణాను సాధించారు. కేవలం ఒక్కడిగా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలెట్టి కలగా మారిన తెలంగాణాను సాధించారు అంటే అది చిన్న విషయం కాదు. అంతేనా రెండు సార్లు తెలంగాణాకు సీఎం గా అయి పూర్తిగా రాజకీయ ఆధిపత్యం చలాయించారు.

అలాంటి కేసీఆర్ 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఆ తరువాత ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ మరోసారి చావు దెబ్బ బీఆర్ఎస్ తిన్నది. ఏకంగా జీరో నెంబర్ కి పడిపోయి ఒక్క సీటునూ గెలుచుకోలేక చతికిలపడి పోయింది.

మరో వైపు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు అంతా అధికార కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు. అంతే కాదు చెట్టుకొకరుగా పుట్టకొకరుగా విడిపోతున్నారు. బీఆర్ఎస్ కి రానున్న అయిదేళ్ళూ ఎలా పార్టీని ముందుకు తీసుకుని పోవాలన్నది కత్తి మీద సాము లాంటి వ్యవహారంగా మారింది.

ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలను అమలు చేసి పార్టీని గాడిన పెడతారు అని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ చాలా చిత్రమైన ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు. తెలంగాణలో బీఅర్ఎస్ ని పటిష్టం చేయడం ఎలాగో తెలుసుకోవడానికి ఫాలో స్టాలిన్ అని అంటున్నారు తమిళనాడులో డీఎంకే ఎలా ఎదిగింది ఎలా వరస విజయాలు సాధిస్తోంది అన్నది తెలుసుకోవడానికి బీఆర్ఎస్ నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపిస్తున్నారుట.

ఇదంతా రాజకీయ అధ్యయనం పేరుతో సాగుతుందిట. 2021లో తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఈ రోజుకీ డీఎంకేని ఢీ కొట్టే పార్టీ అయితే అక్కడ లేదు. దాంతో స్టాలిన్ ఏ రకమైన పొలిటికల్ వ్యూహాలు రచిస్తున్నారు అక్కడ డీఎంకే సంస్థాగతంగా బలంగా ఉండడానికి ఏమి చేస్తుంది అన్నది బీఆర్ఎస్ టీం స్టడీ చేస్తుంది అని అంటున్నారు.

అలా వారు స్టడీ చేసి ఇచ్చిన నివేదికతో కేసీఆర్ బీఅర్ఎస్ ని తిరిగి గాడిన పెట్టేందుకు పూనుకుంటారు అని అంటున్నారు. అయితే కేసీఅర్ అంటేనే వ్యూహాల పుట్ట. ఆయన మరో పార్టీని వ్యూహాల కోసం స్టడీ చేయడం ఏంటి అన్న చర్చ బయల్దేరింది. కేసీఆర్ లో కొత్త వ్యూహాలు ఇక పుట్టవా లేక ఆయన అవుట్ డేటెడ్ అయిపోయారా అన్న ప్రశ్నలూ వస్తున్నాయి.

లేకపోతే తెలంగాణా కల్చర్ వేరు, తెలంగాణా పొలిటికల్ సినారియో వేరు. తమిళనాడు పొలిటికల్ కల్చర్ వేరు అని గుర్తు చేస్తున్నారు. తమిళనాడులో డీఎంకేకి మొదటి నుంచి కమిటెడ్ క్యాడర్ ఉంది. ద్రవిడ సిద్ధాంతాలను బేస్ చేసుకుని పుట్టిన పార్టీ అది. బీఆర్ఎస్ అయితే ఎమోషన్స్ ని బేస్ చేసుకుని పుట్టింది. ఎమోషన్స్ తగ్గినా లేక ఆయా ఉద్దేశ్యాలు నెరవేరినా ఆ పార్టీలకు ఉనికి ఉండదు.

ఇపుడు తెలంగాణాలో అదే జరుగుతోంది అని అంటున్నారు. డీఎంకే అలా కాదు కాలానికి అతీతంగా ఒక ద్రవిడ కల్చర్ ద్రవిడ ఫిలాసఫీ తో ముందుకు సాగుతోంది. దానికి ఆల్టరేషన్ పార్టీలు కూడా అక్కడ లేవు. రాజకీయంగా చూస్తే డీఎంకేకు అనుకూలంగా ఉంది.

పైపెచ్చు జాతీయ పార్టీల హవా అసలు ఉండదు, ఇలా ఎన్నో విషయాలలో తమిళనాడుకు తెలంగాణాకు పూర్తి భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. కానీ కేసీఆర్ మరి ఏ ఉద్దేశ్యంతో డీఎంకేను స్టడీ చేయమంటున్నారో సొంత పార్టీ వారికీ అర్థం కావడం లేదు అని అంటున్నారు. స్టాలిన్ ని ఫాలో అయితే కేసీఆర్ కి లాభమా నష్టమా అన్నది ఫ్యూచర్ తేలుస్తుంది అని అంటున్నారు.