పవర్ పోతే అంతేనా కేసీఆర్? పదేళ్లు సీఎంగా చేయనిది ఇప్పుడు చేసుడా?
అధికారం చేతిలో ఉన్నప్పుడు దాని విలువ తెలీదు. ఒక్కసారి చేజారిన తర్వాత కానీ దాని కోసం ఎంత కష్టపడాలో అర్థమవుతుంది.
By: Tupaki Desk | 6 May 2024 4:53 AM GMTఅధికారం చేతిలో ఉన్నప్పుడు దాని విలువ తెలీదు. ఒక్కసారి చేజారిన తర్వాత కానీ దాని కోసం ఎంత కష్టపడాలో అర్థమవుతుంది. ఈ విషయం గులాబీ బాస్ కేసీఆర్ కు ఇప్పుడు బాగానే అర్థమైందా? అంటే అవునంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో చేతికి చిక్కిన అధికారాన్ని నాన్ స్టాప్ గా పదేళ్లు అనుభవించిన గులాబీ బాస్ కు.. ఆ పవర్ పోయిన నాలుగు నెలలకే ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఐదేళ్లు కాదు.. ఐదు నెలల కూడా ఉండదంటూ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాను ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఎవరైనా ప్రభుత్వం పడిపోతుందన్న మాట అంటే చాలు.. అంతకు మించిన రాజద్రోహం మరొకటి లేదన్నట్లుగా ఫైర్ అయ్యే కేసీఆర్.. తనవరకు వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు రాజకోట లాంటి ప్రజాభవన్ లోకి మంత్రులకే ఎంట్రీ ఉండేది కాదు. అలాంటిది సామాన్యుల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.
అయితే ప్రజాభవన్ లేదంటే ఫామ్ హౌస్ నుంచి పాలన సాగించిన తీరు తోపు నేతల్ని సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. ముఖ్యమంత్రిగా పని చేసిన పదేళ్ల కాలంలో సచివాలయానికి వెళ్లి పని చేసిన సందర్భాలు వేళ్ల మీద లెక్కేయొచ్చన్నది తెలిసిందే. తనకు నచ్చినట్లుగా నిర్మించిన సచివాలయానికి హాజరైన కేసీఆర్ పాలన మీద ప్రజల్లో నెలకొన్న అసంత్రప్తి.. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడటంతో పాటు అధికారం చేజారిన పరిస్థితి.
పవర్ పోయిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఇంటికే పరిమితమైన కేసీఆర్.. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచార దూకుడు పెంచారు. ఏ చిన్న అవకాశాన్ని విడవని ఆయన.. ఘాటు వ్యాఖ్యలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. రేవంత్ ప్రభుత్వం పడిపోతుందంటూ శాపనార్థాలు పెడుతున్నారు. ఎన్నికల వేళ ఇలాంటివి మామూలే. అయితే.. తన తీరుకు భిన్నంగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఆసక్తికరంగా మారింది.
ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆగిన కేసీఆర్.. అక్కడి టీ పాయింట్ లో దాదాపు గంట పాటు కూర్చున్నారు. టీ తాగి.. సమోసాలు తెప్పించుకుని తిన్నారు. అంతేకాదు.. తనతో సెల్ఫీలు దిగటానికి వచ్చిన ప్రజలకు.. చిన్నారులకు అవకాశం ఇచ్చిన వైనం చూసినప్పపుడు.. ఇదే కొండగట్టు దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో అంత మంది మరణిస్తే.. వారి కటుుంబాల వద్దకు వెళ్లి.. వారిని పరామర్శించి.. ఓదార్చటం లాంటివి ఎందుకు చేయలేదు? అన్నది ప్రశ్న.
అధికారంలో ఉన్నప్పుడు ప్రజల వద్దకు రావటానికి ఇష్టపడని కేసీఆర్.. చేతిలో పవర్ లేకుండా పోయినప్పుడు మాత్రం ప్రజలతో గడిపేందుకు ఇష్టపడే తీరు చూసినప్పుడు.. అధికారమా మజాకానా? అన్న భావన కలుగక మానదు. పదేళ్లు అధికారం ఉన్నప్పుడు చేయని పనుల్ని.. పవన్ పోయిన నాలుగు నెలలకే చేస్తున్న కేసీఆర్ తీరుకు ప్రజల రియాక్షన్ ఏ రీతిలో ఉంటుందన్నది తేలాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.