రాజ్యసభ సీటు.. ఈసారి సీనియర్ నేతకు కేసీఆర్ షాక్!
ఈ నేపథ్యంలో ఈసారి కేకేకు కేసీఆర్ రాజ్యసభ సీటు కట్టబెడతారా, లేదా అని ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు కేకే రాజ్యసభకు బీఆర్‌ఎస్ తరఫున ఎంపికయ్యారు.
By: Tupaki Desk | 19 Aug 2023 4:02 PM GMTతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ ఏడాది చివరలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపిక, చేరికలు, మార్పులు, చేర్పులు, సామాజిక సమీకరణాల కూర్పు తదితర అంశాలపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు. నేడో, రేపో అసెంబ్లీ అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు పనిలో పనిగా రాజ్యసభకు అభ్యర్థులను కూడా కేసీఆర్ ఫైనల్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. త్వరలో తెలంగాణ నుంచి రాజ్యసభలో రెండు ఖాళీలు ఏర్పడనున్నాయి. ఈ రెండూ ఎమ్మెల్యేల బలం రీత్యా బీఆర్‌ఎస్ కే దక్కనున్నాయి. ఖాళీ అయ్యే రెండు స్థానాల్లో బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కంచర్ల కేశవరావు (కేకే) సీటు కూడా ఉంది.
ఈ నేపథ్యంలో ఈసారి కేకేకు కేసీఆర్ రాజ్యసభ సీటు కట్టబెడతారా, లేదా అని ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు కేకే రాజ్యసభకు బీఆర్‌ఎస్ తరఫున ఎంపికయ్యారు. వాస్తవానికి రెండోసారే ఆయనను పక్కనపెడతారని వార్తలు వచ్చినా.. కేకేకు ఉన్న రాజకీయ అనుభవం, హిందీ భాషా పరిజ్ఞానం, దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలతో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలతో ఉన్న పరిచయాల కారణంగా కేకేకు మరోసారి ఆఫర్ ఇచ్చారు.
అయితే మూడోసారి మాత్రం పొడిగింపు ఉండదని అంటున్నారు. ఇప్పటికే కేకే కుమార్తె విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్ గా ఉన్నారు. ఇటీవల కాలంలో కేకే కుటుంబంపైన పెద్ద ఎత్తున భూఆక్రమణల ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆయనకు వయసు కూడా ప్రతిబంధకమవుతోందని చెబుతున్నారు. దీంతో కేకేకు ఈసారి అవకాశం ఉండదని ప్రచారం సాగుతోంది. ఈ కారణాలు మాత్రమే కాకుండా బీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ సీట్లు ఆశిస్తున్న ఔత్సాహికుల సంఖ్య చాలా ఎక్కువ ఉండటం కూడా కేకేను ఈసారి పక్కనపెట్టడానికి ఆస్కారం ఉందని అంటున్నారు.
అంతేకాకుండా ఇప్పుడు అసెంబ్లీ సీట్లు లభించనివారికి న్యాయం చేయాల్సి ఉంటుంది. అలాగే పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణకు ఈసారి ఒక రాజ్యసభ సీటు కేటాయిస్తారని అంటున్నారు.
అలాగే తమకు ముందు నుంచి కొరకరాని కొయ్యగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోపై కేసీఆర్ దృష్టి సారిస్తారని అంటున్నారు. ఈసారి ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరి (అసెంబ్లీ సీటు దక్కకపోతే), నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావులతో పాటు మాజీ ఎంపీ మధుసూదనాచారి, మాజీ మంత్రి బసవరాజు సారయ్య, మాజీ ఎంపీ మందా జగన్నాథం పేర్లు రాజ్యసభకు వినిపిస్తున్నాయి. అలాగే గాదరి బాలమల్లు, సీతారాం నాయక్, పరిశ్రమ వర్గాల నుంచి పార్థసారథిరెడ్డి పేర్లు కూడా చర్చల్లోకి వస్తున్నాయి. మరి కేసీఆర్ వీరిలో ఎవరిని రాజ్యసభకు ఎంపిక చేస్తారో వేచిచూడాల్సిందే.