Begin typing your search above and press return to search.

కేసీఆర్ మౌనం అంగీకారం కాదంట... సైలెన్స్ వెనుక బిగ్ ప్లాన్?

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్ పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Dec 2023 3:30 PM GMT
కేసీఆర్  మౌనం అంగీకారం కాదంట... సైలెన్స్  వెనుక బిగ్  ప్లాన్?
X

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్ పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వాస్తవానికి సుమారు 50సీట్ల వరకూ బీఆరెస్స్ సాధించి ఉంటే రాజకీయం మరోరకంగా ఉండేదని.. కాకపోతే 39 సీట్లకే పరిమితం కావడంతో మరో ఆప్షన్ లేక కేసీఆర్ మౌనం వహించారని చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ మౌనాన్ని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

అవును... తెలంగాణ ఎన్నికల్లో బీఆరెస్స్ కు ఆ పార్టీనేతలు ఊహించని స్థాయిలో షాక్ తగిలిందనే చెప్పాలి. ఈ సమయంలో బయట నుంచి బీజేపీ, లోపల నుంచి ఎంఐఎం మద్దతు తీసుకున్నా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకుండా ప్రజలు తీర్పునిచ్చారు. ఈ సమయంలో తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటారనే ఆలోచనతో ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించాలని కాంగ్రెస్ భావించిందని తెలిపారు.

అయితే డీకే శివకుమార్ ఆందోళనకి, పరిశీలకుల అంచనాలని, బీఆరెస్స్ కార్యకర్తల ఊహలకి అందకుండా కేసీఆర్ సైలంట్ అయిపోయారు. తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన తెలంగాణ ఓటర్లను ఉద్దేశించి ఒక్కమాటా మాట్లాడకుండా ఫాం హౌస్ కి వెళ్లిపోయారు! అయితే కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే దానర్ధం పూర్తిగా ఓటమిని అంగీకరించినట్లు కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాస్త గ్యాప్ తీసుకుని బాస్ ఈజ్ బ్యాక్ అనే అవకాశం లేకుండా పోదని చెబుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ తరహా చర్చ ఒకటి జరుగుతుంది. ఇందులో భాగంగా... తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపట్టి.. కొత్త ప్రభుత్వం హనీమూన్ పిరియడ్ ముగిసిన అనంతరం వారి వైఫల్యాలను ఎండగడుతూ, నిర్ణయాలను తప్పుపడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రజాక్షేత్రంలోకి దిగుతారని అంటున్నారు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ కార్యక్రమం ఉండొచ్చని చెబుతున్నారు.

అనంతరం పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలను, మంత్రి పదవులు దక్కని కీలక నేతలను తమ వైపుకి తిప్పుకొని తిరిగి కుర్చీని కైవశం చేసుకోవడానికి గులాబీ అధినేత కచ్చితంగా ప్లాన్ చేస్తారని చర్చిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల వరకూ అలాంటి కార్యక్రమాలు చేయకుండా కాస్త ఓపిగ్గా ఉండాలని ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతుంది.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్.. ఈ సమయంలో పార్లమెంట్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని అనంతరం నెక్స్ట్ స్టెప్ ఉండబోతుందని చెబుతున్నారు. మరోపక్క... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఐకమత్యం కూడా కేసీఆర్ ప్లాన్స్ లో కీలక భూమిక పోషించవచ్చని సమాచారం!