కేసీఆర్ సైలెంట్ వెనక...!?
అపర చాణక్యుడు కేసీఅర్ మౌనం వెనక ఏముంది అన్నదే ప్రస్తుతం చర్చగా సాగుతోంది. కేసీఆర్ వంటి వారు వివిధ రకాలుగా ఆలోచిస్తారు.
By: Tupaki Desk | 21 March 2024 11:15 AM GMTఅపర చాణక్యుడు కేసీఅర్ మౌనం వెనక ఏముంది అన్నదే ప్రస్తుతం చర్చగా సాగుతోంది. కేసీఆర్ వంటి వారు వివిధ రకాలుగా ఆలోచిస్తారు. పక్కా వ్యూహాలు రూపొందిస్తారు. అటువంటి కేసీఅర్ కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. నాటి నుంచి కేసీఆర్ నోటి వెంట మాటలు చాలా పొదుపుగా తక్కువగా వస్తున్నాయి.
ఇక కేసీఆర్ రాజకీయంగా పెద్దగా హడావుడి చేయడం లేదు. ఒకటి రెండు సభలు తప్పించి ఆయన ఎక్కడా కనబడటం లేదు. మీడియా ముందుకు అసలు రావడమేలేదు. మరి కేసీఆర్ ఎందుకు ఇంత సైలెంట్ మెయింటెయిన్ చేస్తున్నారు. దాని వెనక ఏముంది అన్నదే అంతటా చర్చగా ఉంది.
అయితే కేసీయార్ సైలెంట్ వెనక చాలా విషయాలు ఉన్నాయని అంటున్నారు. అందులో ఒకటి ప్రణీత్ రావు అరెస్ట్, అలాగే తన ముద్దుల కుమార్తె కవిత అరెస్ట్ ఇలా దెబ్బ మీద దెబ్బ పడిపోయింది. రాజకీయంగా చెడ్డ రోజులు ఉండొచ్చు కానీ మర్తీ ఇంతలానా అసలు గుక్క తిప్పుకోనీయకుండా జరుగుతున్న సంఘటనల్తో కేసీఆర్ ఫుల్ సైలెంట్ అయ్యారా అన్న చర్చ వస్తోంది.
ఇక ప్రణీతరావు ఒక లిస్ట్ చెప్పారని అంటున్నారు. అందులో కానీ కేసీఅర్ కుటుంబం ఉందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయట. ఆ సంగతి అలా ఉంటే కవిత మీద పెట్టిన లిక్కర్ కుంభకోణంలో డబ్బు ఏకంగా దుబాయ్ వెళ్లిందా అన్నది మరో చర్చగా ఉంది. ఈ వైపు నుంచి ఈడీ కూపీ లాగుతోంది. అదొక టెన్షన్ ఉండనే ఉంది.
ఇపుడు అది చాలదు అన్నట్లుగా మరో విషయం కూడా సాగుతోంది. అదే రాజకీయ ఫిరాయింపులు. నీవు నేర్పిన విద్యయే అన్నట్లుగా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఇపుడు క్యూ కట్టి మరీ అధికార పార్టీ వైపు వెళ్ళిపోతున్నారు.
ఇలా చాలానే జరుగుతున్నాయి. సరే ఇవన్నీ జరుగుతున్నా బీఆర్ఎస్ పెద్దాయన మాత్రం అంతా చూస్తున్నారు. మౌనంగానే ఉంటున్నారు. కేసీఆర్ ఫుల్ సైలెంట్ అవడం వెనక వ్యూహమే ఉందా లేక చోద్యం చూసే తీరు కనిపిస్తోందా అంటే జవాబు ఎవరికి వారే చెప్పుకోవాలని అంటున్నారు.
అయితే గులాబీ బాస్ సైలెంట్ గా ఉన్నారు అంటే అది భయంకరమైన నిశ్శబ్దం అని ప్రళయానికి ముందు ఉండే సైలెంట్ అని అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఒక్కసారి కనుక కేసీఆర్ మౌనం వీడితే తట్టుకోలేరు అని కూడా అంటున్నారు. కేసీఆర్ ని సిం హంతో పోలుస్తున్నారు. సిం హం కూడా రెండు అడుగులు వెనక్కి వేస్తే వెనక్కి పోయినట్లు కాదని అది దూకుడు చేయడానికే అని కూడా పోలిక తెస్తున్నారు.
సరే ఈ పోలికలు అయితే బాగానే ఉంటాయి. ఎందుకంటే కేసీఅర్ కి బీఆర్ఎస్ కి వీరాభిమానులు ఎక్కువే. అయితే గతంలో ఏమి జరిగింది ఇపుడు ఏమి జరుగుతోంది అన్నది చూసుకోవాలి కదా అని అంటున్నారు. ఉద్యమ సమయంలో అంటే ఇప్పటికి పాతికేళ్ళ క్రితం కేసీఅర్ హవా నడచింది. ఆనాడు ఆయన చెప్పిందే వేదం కావచ్చు. ఆయన మాట తెలంగాణా ప్రజానీకానికి మంత్రం కావచ్చు. కానీ ఇపుడు మాత్రం అలాంటి సీన్ లేదని అంటున్నారు.
ఇపుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకు బీఆర్ఎస్ విలవిలలాడుతోంది అని అంటున్నారు. ఎంతలా అంటే కూకటి వేళ్ళతోనే ప్రాంతీయ పార్టీని పట్టి పెకిలించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. దాని ధాటికి గులాబీ తోట కకావికలం అవుతోంది. మరి ఇంత జరిగినా కేసీఆర్ సైలెంట్ అని అదే వ్యూహమని అనుకుంటే ఏకంగా గులాబీ తోటకే నిప్పంటుంకుంటుంది అని అంటున్నారు. అపుడు ఆలస్యంగా లేచినా మౌనం వీడినా లేక దూకుడు చేసినా ఉపయోగం ఉంటుందా అన్నది కూడా సందేహంగా ఉందిట.
ఏది ఏమైనా కేసీఅర్ మౌనం మీద ఎవరికి తోచిన తీరులో వారు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇంతకీ కేసీఆర్ సైలెంట్ వెనక చాణక్యం ఉందా. ఏమో.