ఎన్నికల ప్రచార శంఖం పూరించిన కేసీఆర్.. సిరిసిల్లలో ప్రజాశీర్వాద సభ.. సంచలన కామెంట్లు
తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబందించి ఆయన.. ప్రచార శంఖాన్ని పూరించారు. సిరిసిల్లలో తాజాగా జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
By: Tupaki Desk | 17 Oct 2023 1:23 PM GMTగత 10 ఏళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం కలలో కూడా ఊహించనంతగా అభివృద్ధిని చేసి చూపిందని బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా పార్టీని ఆశీర్వదించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబందించి ఆయన.. ప్రచార శంఖాన్ని పూరించారు. సిరిసిల్లలో తాజాగా జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తమది చేతల ప్రభుత్వమని, చేనేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. ఎవరూ కలలో కూడా ఊహించనంతగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని కేసీఆర్ చెప్పారు.
అనేక పథకాలు ప్రవేశ పెట్టామని, తెలంగాణను సుసంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ముఖ్యంగా చేనేతలను ఆదుకునేందుకు ఎన్నో కీలక పథకాలు తీసుకువచ్చామన్నారు. చేనేతలను ఆదుకునేందుకు ఏటా బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు చేనేతలు ఆత్మహత్యలు చేసుకునేవారని.. వారి ఆత్మహత్యలతో రాష్ట్రం కన్నీరు పెట్టుకుందని తెలిపారు. నేత కార్మికులకు అండగా ఉంటామని అప్పట్లో చెప్పినట్టే.. అధికారంలోకి వచ్చాక వారి సమస్యలను పరిష్కరించామన్నారు.
అయితే, ఎంత చేసినా కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయని.. త్వరలోనే వాటిని కూడా పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. మండు వేసవిలో కూడా అప్పర్ మానేరు ఉరకలేస్తోందని, అప్పర్ మానేరు నుంచి సిరిసిల్ల వరకు సజీవ జలధారగా మారిందన్నారు. సమైక్య పాలనలో రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్లతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని కేసీఆర్ చెప్పారు.
మేనిఫెస్టో అంటే మాటలు కాదు!
మేనిఫెస్టోను ఏదో తూతూ మంత్రంగా తాము ప్రవేశ పెట్టలేదని సీఎం కేసీఆర్ అన్నారు. చేసేవే చెబుతున్నామన్నారు. మాటల మనుషులు చాలా మంది ఉంటారని, కానీ, తాము చేతల మనుషుల మని వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తామని చెప్పారు. రేషన్‌కార్డుదారులందరికీ సన్న బియ్యం ఇస్తామన్నారు.
కాంగ్రెస్ వస్తే..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఆగమాగమవుతుందని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ప్రతిష్టాత్మక పథకం ధరణిని బంగాళాఖాతంలో వేస్తారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వస్తే రైతులు ఆగం అవుతారన్నారు. దిక్కుమాలిన కాంగ్రెస్ నేతల మాటలు నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు. దుర్మార్గులు పెట్టె పీకులాటకు రైతులు ప్రమాదంలో పడతారని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల మాటలు కైలాసం ఆటలో పాము మింగినట్టే ఉంటాయన్నారు. అబద్ధాలతో, ఆపద మొక్కులతో వచ్చే వారిని నమ్మొద్దని పిలుపునిచ్చారు.