జంపింగులను నమ్మకుర్రి... కేసీఆర్ సర్ కొత్త పిలుపు.. భయంతోనేనా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు ఇలా ప్రారంభమైందో లేదో నాయకులు అలా తమకు అవకాశం ఉన్న పార్టీల్లోకి జంప్ చేసేశారు.
By: Tupaki Desk | 4 Nov 2023 5:37 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు ఇలా ప్రారంభమైందో లేదో నాయకులు అలా తమకు అవకాశం ఉన్న పార్టీల్లోకి జంప్ చేసేశారు. ఇప్పటికీ .. ఇంకా ఈ జంపింగులు జరుగుతూనే ఉన్నాయి. వీటికి ఆది అంతం అంటూ ఏమీ లేకుండా పోవడం గమనార్హం. అయితే.. జంప్ చేస్తున్నవారికి కొన్ని పార్టీలు టికెట్లు ఇచ్చాయి. ఉదాహరణకు ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లగానే ఆయనకు టికెట్ దక్కింది.
అలాగే బీజేపీలోనూ ఇలా వచ్చిన వారు అలా టికెట్లు దక్కించుకున్నారు. ఎటొచ్చీ.. అధికార పార్టీ మాత్రమే ఈ విషయలో ఒకింత జాగ్రత్తగా వ్యవహరించి.. ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసింది. అయినప్పటికీ.. ఒకటి రెండు స్థానాల్లో జంపింగులు ఆశలు పెట్టుకున్నారు. పొన్నాల లక్ష్మయ్య వాస్తవానికి టికెట్ దక్కక పోవడంతోనే బీఆర్ ఎస్ వైపు చూశారు. కానీ, ఆయనకు టికెట్ దక్కే పరిస్థితి లేకుండా పోయింది.
ఇప్పుడు టీడీపీ నుంచి బయటకు వచ్చిన కాసాని జ్ఞానేశ్వర్ కూడా టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈయన ఈ రోజో రేపో బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే జరిగితే.. ఘోషామహల్ టికెట్‌ను ఆయనకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా జంప్ జిలానీలకు కాంగ్రెస్, బీజేపీలు ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నాయి. అయితే.. వీరివల్ల బీఆర్ ఎస్ ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుందని గుర్తించిన సీఎం కేసీఆర్.. కొత్త సెంటిమెంటును తెరమీదకి తెచ్చారు.
``పార్టీ మారెటోళ్లు అత్యంత ప్రమాదకారులు`` అంటూ.. ఆయన ఖమ్మం సభలో తుమ్మలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు ఒక పార్టీ మారారు.. రేపు ఇంకో పార్టీలోకి రారని గ్యారెంటీ ఏముందనే వాదనను కూడా కేసీఆర్ తీసుకువచ్చారు. వాస్తవానికి .. గత పదేళ్లలో అనేక మంది నాయకులు ఇలానే చేశారు. వీటిని ప్రోత్సహించింది కూడా కేసీఆరే కావడం గమనార్హం. అయితే, ఇప్పుడు మాత్రం ఆయన జంపింగులు తప్పని పరోక్షంగా చెబుతున్నారు
కానీ, రాజకీయాల్లో శాశ్వత శతృవులు, మిత్రులు ఉండరు. ఇలానే పార్టీలకు కూడా ఎవరు అవకాశంగా కనిపిస్తే.. వారిని అక్కున చేర్చుకోవడం పరిపాటిగా మారింది. కానీ, ఇప్పుడు తమకు ఎసరు వస్తోందని గ్రహించిన కేసీఆర్ వెంటనే మాట మార్చి.. సెంటిమెంటును ప్లే చేస్తున్నారు. `జంపింగులను నమ్మకుర్రి` అంటూ.. వ్యాఖ్యానిస్తున్నారు. మరి తెలంగాణ సమాజం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.