Begin typing your search above and press return to search.

రైతు శత్రు ప్రభుత్వం.. చీల్చి చెండాడుతాం.. కేసీఆర్ గర్జన

అసెంబ్లీ సమావేశాలకు మాత్రం చేతి కర్ర సాయం లేకుండానే హాజరయ్యారు.

By:  Tupaki Desk   |   25 July 2024 9:46 AM GMT
రైతు శత్రు ప్రభుత్వం.. చీల్చి చెండాడుతాం.. కేసీఆర్ గర్జన
X

తెలంగాణలో ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ తనదైన శైలిలో పదునైన వ్యాఖ్యలతో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం రెండు శాసన సభ సమావేశాలకు దూరంగా ఉన్న ఆయన.. బడ్జెట్ సమావేశాలకు మాత్రం వచ్చారు. అయితే, డిసెంబరులో ఫామ్ హౌస్ లో గాయపడిన ఆయన శస్త్రచికిత్స అనంతరం కోలుకుని చేతి కర్ర సాయంతో బయటకు వచ్చారు. దానితోనే లోక్ సభ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు మాత్రం చేతి కర్ర సాయం లేకుండానే హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై నిప్పులు చెరిగారు.

సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విధానాలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రంగాలపై రేవంత్ సర్కారుకు నిర్దిష్టమైన విధానం ఏదీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా రెండు పంటలకు రైతుబంధు ఇచ్చామని.. కాంగ్రెస్‌ సర్కారు మాత్రం దానిని ఎగ్గొడతామని చెబుతోందని విమర్శించారు. రైతులకు తాము ఇచ్చిన డబ్బును దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తున్నారంటే రేవంత్ ది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని.. విద్యుత్తు, నీటి సరఫరా లేదని.. అసలు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన రైతు భరోసా ప్రస్తావన ఎక్కడ ఉందని కేసీఆర్ నిలదీశారు.

భట్టి ప్రసంగం కథలా ఉంది

బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి చేసిన ప్రసంగం ఓ రాజకీయ ప్రసంగంలా, కథలా సాగిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. రైతులను వంచిస్తూనే.. బడ్జెట్ లో ఒక్క విధాన ప్రకటన చేయలేదని, కొత్తగా ఒక్క పరిశ్రమ పేరూ చెప్పలేదని మండిపడ్డారు. ఏ ఒక్క అంశంపైనా రేవంత్ ప్రభుత్వానికి స్పష్టత లేదని.. మహిళలకూ ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్తు వ్యవస్థ సక్రమంగా లేదని.. ఇకపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీకి పూర్తిగా వస్తున్నట్లేనా

కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఆయన క్రమంతప్పకుండా అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో వచ్చిపోయినట్లుగా కాక.. క్రియాశీలంగా వ్యవహరిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే.. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్న కమ్రంలో కేసీఆర్ ఉనికి కోసమైనా ఈ పనిచేయక తప్పదనే వాదన వస్తోంది. అసెంబ్లీకి రావడం ద్వారా రాజకీయంగా పోరాటం చూపినట్లు అవుతుందని.. అయినా అసెంబ్లీ నాలుగు రోజులే కాబట్టి పెద్దగా ఇబ్బందికరంగానూ భావించరని పేర్కొంటున్నారు.