వరంగల్‌పై కేసీఆర్ తడబాటు.. రీజనేంటి? డ్యామేజీ ఖాయమేనా?
ఇది ఎస్సీ నియోజకవర్గం కావడం.. పైగా ప్రతిష్టాత్మకం కావడంతో కేసీఆర్.. ఆలోచనతోనే అడుగులు వేశారు.
By: Tupaki Desk | 13 April 2024 1:30 AM GMTపార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. టికెట్లను ఖరారు చేశారు. మొత్తం 17 స్థానాల్లో రెండు కీలక స్థానాలపై తడబాటుకు ఆయన గురయ్యారు. దీనిలో తొలిదశలో హైదరా బాద్ ఉంది. అయితే.. ఎట్టకేలకు దీనిని ప్రకటించారు. ఇక, మరో కీలక నియోజకవర్గం వరంగల్. ఈ విషయంలో మాత్రం చివరి వరకు తర్జన భర్జనలు.. తడబాట్లు తప్పలేదు. ఇది ఎస్సీ నియోజకవర్గం కావడం.. పైగా ప్రతిష్టాత్మకం కావడంతో కేసీఆర్.. ఆలోచనతోనే అడుగులు వేశారు.
తొలి దశలోనే వరంగల్ సీటును కడియం కావ్యకు కేటాయించారు. ఉన్నత విద్యావంతురాలు కావడం.. పైగా డాక్టర్‌గా అందరికీ సుపరిచితురాలు రావడంతో ఆమెను కేసీఆర్ ఎంపిక చేశారు. కానీ, అదేసమయం లో ఫోన్ ట్యాపింగ్, కవిత లిక్కర్ కేసులు తెరమీదికి రావడంతో వీరు జంప్ చేసేశారు. నేరుగా వెళ్లి కాంగ్రెస్ లో చేరి అక్కడ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తన పార్టీ నాయకురాలే.. ఇప్పుడు కేసీఆర్ కు ప్రత్యర్థిగా మారిపోయింది.
దీంతో కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న కడియం కావ్యనుఓడించాలన్నది కేసీఆర్‌వ్యూహం. ఇదే ఆయనను తర్జన భర్జనకు గురి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల తనను తిట్టిపోయినా.. కడియం కుటుంబాన్ని పూర్తిగా ద్వేషించే మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను ఆహ్వానించారు. ఆయనకు టికెట్ ఇస్తామని మీడియాకు లీకులు ఇచ్చారు. దీంతో మీడియా రాజయ్యపేరును ఊదర గొట్టింది. మరోవైపు ఈ నిర్ణయంతో రాజయ్య సంబరాలు చేసుకున్నారు. కుటుంబంలో స్వీట్లు కూడా తినిపించుకున్నారు.
కట్ చేస్తే.. కేసీఆర్.. వరంగల్ టికెట్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లాకే చెందిన హన్మకొండ వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ కు కేటాయించారు. ఇది అనూహ్య నిర్ణయం. అసలు పేరు కూడా తెరమీదికి రాని నాయకుడికి ఆయన ఎంపీ టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం బీఆర్ ఎస్ నాయకు డిగా.. హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ సుధీర్‌కు ఇది నక్కను తొక్కినంత పనైంది.
ఈయన విధేయుడే కావొచ్చు.. కానీ.. రాజయ్యను మరోసారి అవమానించారన్న చర్చ తెరమీదికి వచ్చింది. సుధీర్‌కు టికెట్ ఇచ్చారన్న వాదన కన్నా.. ఇదే ఎక్కువగా వినిపిస్తోంది. అసలే రగిలిపోతున్న రాజయ్యపై మరింత పెట్రోల్ చిలకరించినట్టు అయింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కీలక ఎన్నికల సమయంలో ఎస్సీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి కేసీఆర్ ఎందుకు ఇలా తడబడ్డారన్నది ప్రశ్న.