Begin typing your search above and press return to search.

పొత్తులు ఎత్తులు వ్యూహాల మధ్య ఢిల్లీకి కేసీఅర్...!

బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కి ఢిల్లీతో అర్జెంటుగా పని పడిందా అన్న అనుమానాలు వస్తున్నాయి

By:  Tupaki Desk   |   19 Feb 2024 4:28 PM GMT
పొత్తులు ఎత్తులు వ్యూహాల మధ్య ఢిల్లీకి  కేసీఅర్...!
X

బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కి ఢిల్లీతో అర్జెంటుగా పని పడిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. సుమారు రెండున్నర నెలల క్రితం తెలంగాణాలో ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ ఓడింది. కేసీఆర్ మాజీ సీఎం అయ్యారు. ఆనాటి నుంచి ఆయన చాలా సమయం ఇంటివద్దనే ఉంటున్నారు. ఇటీవల నల్గొండ జిల్లాలో ఆయన ఒక భారీ సభతో జనంలోకి వచ్చారు.

ఇపుడు లోక్ సభ ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ బీఆర్ఎస్ ని గేరప్ చేయాల్సిన అవసరం ఉంది. సర్వేలు చూస్తే కాంగ్రెస్ లేదా బీజేపీకి మొగ్గు అని చెబుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకోకపోతే ఒక ప్రాంతీయ పార్టీగా మరిన్ని కొత్త ఇబ్బందులతో కూరుకుని పోయే ప్రమాదం ఉంది అని విశ్లేషణలు వస్తున్నాయి.

ఇంకో వైపు చూస్తే బీఆర్ఎస్ ఒంటరి పోరు చేస్తే కాంగ్రెస్ కి మేలు జరుగుతుందని లేదా బీజేపీ బలంగా ఉన్న చోట్ల కొన్ని సీట్లు కొట్టుకుపోతుందని కూడా అంటున్నారు. దీంతో పొత్తులకు బీఆర్ఎస్ ఆలోచిస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తులకు సుముఖంగా ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇది అనివార్యం అని అంటున్నారు. బీజేపీతో పొత్తు ఉంటే బలంగా కూటమి కట్టి కాంగ్రెస్ మీద పోరాడడం సులువు అవుతుందని అంటున్నారు. అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటుంది కాబట్టి పొత్తు పార్టీగా కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వం ఏర్పడితే కేంద్ర మంత్రి పదవులు కూడా సాధించవచ్చు అన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు.

ఇక తాజాగా బీఆర్ఎస్ ఒక సర్వే చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆ సర్వేలో బీజేపీకి తొమ్మిది సీట్లు కాంగ్రెస్ కి నాలుగు సీట్లు బీఅర్ఎస్ కి మూడు మజ్లీస్ కి ఒక సీటు వస్తుందని తేలింది అని అంటున్నారు. దాంతో బీజేపీతో పొత్తు కోసం కేసీఆర్ తానుగా పనిగట్టుకుని మరీ ఢిల్లీ వెళ్తున్నారు అని అంటున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇటీవల ముగిసాయి. ఉత్తరాది పొత్తులలో క్లారిటీ తెచ్చుకున్న బీజేపీ సౌత్ మీద ఫోకస్ పెట్టింది. కర్నాటకలో ఇప్పటికే జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంది. తమిళనాడులో అన్నా డీఎంకే వీడిపోయింది. ఇతత చిన్న పార్టీలతో కూటమి కట్టాలని చూస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పొత్తుల విషయంలో క్లారిటీ కోసం చూస్తోంది. ఏపీలో చంద్రబాబుతో పొత్తు కుదిరినట్లే అంటున్నారు. ఇక తెలంగాణాలో ఒంటరి పోరే అని బీజేపీ నేతలు చెబుతున్నా అక్కడ కాంగ్రెస్ ఎక్కువ ఎంపీ సీట్లు దక్కించుకోరాదు అన్న పట్టుదల బీజేపీ పెద్దలకు ఉంది అని అంటున్నారు. దాంతో బీఆర్ఎస్ తో పొత్తుకు బీజేపీ పెద్దలు కూడా సుముఖంగా ఉన్నారా అన్న చర్చ సాగుతోంది.

ఇన్ని రకాలైన ఆలోచనలు చర్చన నడుమ కేసీఆర్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. కేసీఆర్ ఢిల్లీ టూర్ తో తెలంగాణా రాజకీయాలలో కీలకమైన మార్పులు సంభవిస్తాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పొత్తులు ఎత్తులు వ్యూహాల మధ్య గులాబీ బాస్ హస్తిన పర్యటన తొందరలోనే ఉంటుందని అంటున్నారు. అయితే బీఆర్ఎస్ తో పొత్తుల ఊహాగానాలను మాత్రం తెలంగాణా బీజేపీ నేతలు కొట్టేస్తున్నారు. మరి బీజేపీ బీఆర్ఎస్ పొత్తులు ఉంటాయా లేవా అన్నది కేసీఆర్ ఢిల్లీ టూర్ తరువాత ఫుల్ క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.