దుర్మార్గం చేసిన కాంగ్రెస్ తో ఎందుకు జత కట్టావ్ కేసీఆర్?
అన్నింటికిమించి చరిత్రలోకి వెళ్లి.. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ.. బండకేసి బాదినట్లుగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 21 Nov 2023 10:30 AM GMTనచ్చితే ఆకాశానికి ఎత్తేయటం.. కించిత్ బాధ కలిగినా..కష్టం కలిగినా పాతాళానికి తొక్కేసే రీతిలో మాట్లాడటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటన్న సంగతి తెలిసిందే. కీలక ఎన్నికల ప్రచారవేళ ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున బహిరంగ సభలకు హాజరవుతున్నారు. కాంగ్రెస్ మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇక.. ఆరోపణల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ లాంటి దుష్ట.. దుర్మార్గ పార్టీ మరొకటి లేదన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. అన్నింటికిమించి చరిత్రలోకి వెళ్లి.. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ.. బండకేసి బాదినట్లుగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
గతానికి భిన్నంగా మన దేశంలోని ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణితి రాలేదన్న కొత్త రాగాన్ని ఆలపిస్తున్న ఆయన.. తాను అధికారంలో ఉన్న పదేళ్లలో తాను చెబుతున్న పరిణితి కోసం ఏమేం చేశారో చెప్పాలన్న ప్రశ్నను పలువురు సంధిస్తుననారు. బీఆర్ఎస్ పదేండ్ల పరిపాలనలో స్టేషన్ ఘన్ పూర్ ఎట్లుంది? యాభై ఏండ్ల గత కాంగ్రెస్ పాలనలో ఎట్లా ఉండెనో మీరు తేల్చాలంటూ తాను హాజరయ్యే ప్రతి సభలోని నియోజకవర్గాన్ని ప్రస్తావిస్తున్న కేసీఆర్.. చరిత్రలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎన్ని దారుణాలు చేసిందో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ ప్రజలు వద్దు మొర్రో అని మొత్తుకున్నా వినకుండా కాంగ్రెస్ నాడు తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయిం తీసుకుందన్న కేసీఆర్.. ప్రొ.జయశంకర్ లాంటి వాళ్లు ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ అంటూ ఉద్యమాలు చేస్తుంటే..ఫజల్ అలీ కమిషన్ రిపోర్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తెలంగాణను ఆంధ్రాలో కలిపినట్లుగా పేర్కొన్నారు. అయితే.. నాడు ఆంధ్రాలోకి హైదరాబాద్ స్టేట్ ను కలిపిన ఉదంతంలో కేసీఆర్ చేస్తున్న వాదనకు భిన్నంగా వాస్తవాలు ఉన్నప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటి జోలికి వెళ్లేందుకు రాజకీయ పార్టీలు ఒప్పుకోవటం లేదు. ఏపీలో హైదరాబాద్ స్టేట్ ను కలపాలన్న అంశంపై పెద్ద డిబేటే నడుస్తుంటుంది. అందుబాటులో ఉన్న ఆధారాలు.. సాక్ష్యాలు ఒకలా విషయాన్ని చెబుతుంటే.. కేసీఆర్ మాత్రం మరో రీతిలో రియాక్టు అవుతున్నారు.
ఎన్నికల సందర్భంగా ఆయన మాటలు ఎలా ఉంటాయన్న విషయం తెలిసిందే కావటంతో చాలామంది మౌనంగా ఉంటున్నారు. ‘‘కాంగ్రెస్ చేసిన దుర్మార్గం వల్ల 58 ఏండ్లు తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డరు. 1969లో ఉద్యమం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 400 మంది తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది. కాంగ్రెస్ ప్రభుత్వం మనల్ని 15 ఏండ్లు ఏడ్పించి, ఉద్యమాన్ని ముంచే ప్రయత్నం చేసింది. ఆనాడు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేతో సహా చాలామంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయిండ్రు. మనం దేశంలోని 33 పార్టీల మద్ధతు తీసుకొచ్చి మొండిగ కొట్లాడిన తర్వాత దిగొచ్చిండ్రు. కేసీఆర్ శవయాత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా.. ‘‘కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ తెచ్చుడో’’.. అని నేను ఆమరణదీక్ష చేస్తేగానీ ప్రకటన చేయలేదు’’ అంటూ వ్యాఖ్యానించారు.
నిజానికి కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షతో ప్రకటన వచ్చిందన్న దాని కంటే కూడా.. తెలంగాణకు చెందిన యువకులు తమ ప్రాణాల్ని తెలంగాణ కోసం అదే పనిగా తీసుకోవటంతో నాటి కేంద్రం మీద ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు..సోనియా గాంధీ సైతం తాను తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని మాట ఇచ్చిన నేపథ్యంలోనే తెలంగాణ ప్రకటన ఇవ్వటం జరిగిందే తప్పించి.. కేసీఆర్ కోసం కాదన్న వాదన తెలిసిందే. నిజంగానే కేంద్రం కాని తెలంగాణ ఇవ్వకూడదని డిసైడ్ అయితే.. కేసీఆర్ ను కంట్రోల్ చేయటం పెద్ద విషయం కాదన్న మాట పలువురి నోట వినిపిస్తూనే ఉంది.
ఎక్కడిదాకానో ఎందుకు ఇంత పెద్ద ఉద్యమనేతగా చెప్పుకునే కేసీఆర్.. గడిచిన పదేళ్లలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతూ.. ఆందోళన ఏదైనా చేస్తున్నంతనే.. వారిని ఎంత కర్కశంగా అణిచేశారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కేసీఆర్.. తాను చేసిన దీక్షతోనే తెలంగాణ వచ్చిందని పేర్కొనటం చూస్తే.. తన గొప్పను చెప్పుకోవటమే తప్పించి వాస్తవాల్ని విస్మరిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. తన ఎన్నికల ప్రసంగాల్లో ఎక్కడా కూడా తెలంగాణ కోసం వందలాది మంది ప్రాణత్యాగం చేశారన్న విషయాన్ని కేసీఆర్ ఎందుకు ప్రస్తావించరు? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. నిత్యం కాంగ్రెస్ దుర్మార్గాన్ని చీల్చిచెండాడినట్లుగా మాటలు చెప్పే కేసీఆర్.. 2004లో కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్లు? నిజంగానే కాంగ్రెస్ అత్యంత దుర్మార్గమైన పార్టీనే అయితే.. ఆ పార్టీలో పొత్తు పెట్టుకోకుండా కోట్లాడాలి కదా? అలా ఎందుకు చేయలేదు. తాను చేసిన ఉద్యమాల వల్లే తెలంగాణ సాధన సాధ్యమైందన్నప్పుడు తెలంగాణ ప్రకటన చేసిన వేళలో.. కాంగ్రెస్ పార్టీనిఆకాశానికి ఎందుకు ఎత్తేసినట్లు? అప్పుడు అలా మాట్లాడి.. ఇప్పుడు ఇలా మాట్లాడటాన్ని ఏమనాలి? ఎలా చూడాలి? అన్న చర్చ ఇప్పుడు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అత్యంత దుర్మార్గమైన కాంగ్రెస్ తో జత కట్టిందెందుకు? అన్న ప్రశ్నను పలువురు సంధిస్తుండటం గమనార్హం.