కేసీఆర్ చేయలేదు సరే.. మీరు చేయొచ్చుగా.. అమిత్ షా సర్!
By: Tupaki Desk | 28 Oct 2023 2:30 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదేసమయంలో సవాళ్లు కూడా రేగుతున్నాయి. తాజాగా బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా.. సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర బీజేపీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన 'జనగర్జన సభ'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌కు సవాల్ రువ్వారు. ''బీఆర్ ఎస్ అదికారంలోకి వస్తే.. ఎస్సీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ హామీ ఇవ్వగలరా!'' అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఎస్సీని సీఎం చేస్తానని చెప్పే ధైర్యం కేసీఆర్‌కు ఉందా? అని అమిత్ షా సవాల్ విసిరారు.
అంతేకాదు..తాము అధికారంలోకి వస్తే.. బీసీ వర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. ''కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు కుటుంబ పార్టీలు. వారివారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాయి. రేపు బీఆర్ ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడమే కేసీఆర్ లక్ష్యం.
కానీ, బీజేపీ అలా కాదు. బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తాం'' అని షా వివరించారు. ఇక, బీజేపీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. గత పదేళ్లలో కేసీఆర్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని అన్నారు.
అయితే, అమిత్ షా వ్యాఖ్యలపై వెంటనే నెటిజన్లు ఆసక్తిగా స్పందించారు. ''కేసీఆర్ చేయలేక పోయారు. మరి మీరు ఎస్సీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేయొచ్చుగా! ఆ హామీ మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుండేదేమో..'' అని మెజారిటీ నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందించారు.
అంతేకాదు.. విభజన హామీలను ఇప్పటికీ తొక్కి పెట్టి.. రాష్ట్రానికి చేసిన మేలేంటని ప్రశ్నించారు. కృష్ణాజలాల వివాదాన్ని మరో మలుపు తిప్పి.. మరింతగా వివాదం రాజేశారని అన్నారు. చిత్త శుద్ధి ఉంటే.. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ముందు క్షమాపణలు చెప్పాలని ఎక్కువ మంది వ్యాఖ్యానించడం గమనార్హం.