సింహగర్జనకు రెడీ అవుతున్నారా ?
వరంగల్ జిల్లాలో అక్టోబర్ 16వ తేదీన భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
By: Tupaki Desk | 19 Sep 2023 6:03 AM GMTరాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలన్న టార్గెట్ తో కేసీయార్ చాలా స్పీడుగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే మిగిలిన పార్టీలతో పోల్చుకుంటే చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించేశారు. 119 నియోజకవర్గాలకు గాను 115 చోట్ల అభ్యర్ధులను ప్రకటించి సుమారు నెలన్నర అవుతోంది. కేసీయార్ అభ్యర్థులను అలా ప్రకటించిన కొద్దిరోజులకే సడెన్ గా నరేంద్ర మోదీ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ప్రకటించారు. దాంతో అన్ని పార్టీలతో పాటు కేసీయార్లో కూడా అయోమయం పెరిగిపోయింది.
కారణం ఏమిటంటే జమిలి ఎన్నికలు, ముదస్తు ఎన్నికలనే ప్రచారం బాగా పెరిగిపోవటమే. కేసీయార్ ఏదో ఆలోచనతో అభ్యర్దులను ముందుగా ప్రకటిస్తే అదికాస్త చివరకు ఇంకేదో అయ్యేట్లుగా ఉందనే ప్రచారం మొదలైపోయింది.
దాంతో కంగారుపడిన కేసీయార్ రాష్ట్ర పర్యటనను మానుకున్నారు. అభ్యర్ధులను కూడా ప్రచారానికి వెళ్ళొద్దని ఆదేశించారు. ఎందుకంటే జమిలి, ముందస్తు ఖాయమైతే అభ్యర్ధులను మార్చాల్సొస్తుందనే ఆలోచనకు కేసీయార్ రావటమే.
అయితే ప్రచారం ప్రచారంగా మాత్రమే మిగిలిపోయింది. దానిపై కేంద్రం నుండి ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. చివరకు 19వ తేదీ అంటే ఈరోజు నుండి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మొదలవ్వబోతున్నాయి. ఈ నాలుగు రోజుల్లో జమిలి, ముందస్తుపై కేంద్రం ఏదో ప్రకటన చేయక తప్పదు. అజెండాలో అయితే జమిలి, ముందస్తు ఎన్నికల అంశాలు లేవనే ప్రచారం మొదలైంది. దాంతో కేసీయార్ కాస్త ఊపిరిపీల్చుకుని రాష్ట్రపర్యటనలకు రెడీ అవుతున్నారు. వరంగల్ జిల్లాలో అక్టోబర్ 16వ తేదీన భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఆ భారీ బహిరంగసభకు సింహగర్జన అని పేరు పెట్టారు. బహుశా ఇక్కడే మ్యానిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహిళలు, బీసీలు, మైనారిటిల సంక్షేమం కోసం కొత్త పథకం తీసుకొచ్చే అవకాశం ఉందట. కేంద్ర ఎన్నికల కమీషన్ ఉన్నతాధికారులు మూడు రోజుల పర్యటనకు తెలంగాణాకు వచ్చారు.
వీళ్ళ పర్యటనలో ఎన్నికల నిర్వహణపైనే కసరత్తు చేస్తున్నారు. వీళ్ళు తిరిగి ఢిల్లీకి వెళ్ళి రిపోర్టు ఇచ్చిన తర్వాత అక్టోబర్ లోగా ఏ రోజైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని అనుకుంటున్నారు. అందుకు సంకేతాలు కనబడగానే కేసీయార్ జిల్లాల పర్యటనలకు రెడీ అయిపోవాలని డిసైడ్ అయ్యారు.