క్లాసులతో నేతలు మారుతారా ?
పార్టీ పరిస్దితిపై అధిష్టానం ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటోందట. తాజా రిపోర్టు ప్రకారం పార్టీ ఖాయంగా గెలిచేసీట్లు 41 అట
By: Tupaki Desk | 7 Aug 2023 5:40 AM GMTఅఖిల భారత కాంగ్రెస్ కమిటి సెక్రటరీ, కేంద్రపార్టీలో కీలక నేత కేసీ వేణుగోపాల్ తెలంగాణా నేతలకు ఫుల్లుగా క్లాసుపీకారు. గాంధిభవన్లో జరిగిన సమావేశంలో సీనియర్లందరినీ కూర్చోబెట్టి తలంటుపోశారు. ఐకమత్యంగా ఉండటం, సమిష్టిబాధ్యత తీసుకుని పార్టీని గెలిపించుకోవటం తదితర అంశాలపై భేటీలో చాలాసేపు మాట్లాడారు. కేసీ చెప్పిన ప్రకారం సీనియర్లలో కొందరు ఒకళ్ళపై మరొకళ్ళు ఫిర్యాదులు చేసుకుంటు పార్టీని డిస్ట్రబ్ చేస్తున్నారట. దీనివల్ల పార్టీ బలహీనమైపోతోందని కేసీ చెప్పారు.
ఫిర్యాదులు చేసుకోవటం, పార్టీ బలహీనపడటం ఇపుడే మొదలైనట్లు కేసీ చెప్పటమే విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ పుట్టినదగ్గర నుండి నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తునే ఉంది. కాంగ్రెస్ అనే కాదు ఏ పార్టీలో అయినా నేతల మధ్య ఇదే సమస్య.
ఎప్పుడైతే పార్టీకన్నా తానే గొప్పన్న భావన నేతల్లో మొదలవుతుందో అప్పటినుండే పార్టీని లెక్కచేయటం మానేస్తారు. పార్టీ లేకపోతే తాము లేమన్న కనీస స్పృహతో ఉంటే అప్పుడు పార్టీ నాయకత్వానికి కట్టుబడుంటారు.
అయితే పార్టీలో చాలామంది నేతల్లో పార్టీకన్నా తామే గొప్పనే భావన ఎప్పుడో వచ్చేసింది కాబట్టే కంపుచేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, రుణుకాచౌదరి, జగ్గారెడ్డి, ఉత్తమ్ లాంటి వాళ్ళ వ్యవహారం మొత్తం ఇలాగే ఉంటుంది.
ఇపుడు కేసీ ఇదే విషయాన్ని స్పష్టంగా నేతలకు వివరించారు. ఎన్నికలకు ఇక ఉన్నది 100 రోజులు మాత్రమే కాబట్టి వీలైనన్ని బహిరంగసభలు నిర్వహించమని చెప్పారు. నేతలంతా సమిష్టిగా పర్యటించాలన్నారు.
పార్టీ పరిస్దితిపై అధిష్టానం ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటోందట. తాజా రిపోర్టు ప్రకారం పార్టీ ఖాయంగా గెలిచేసీట్లు 41 అట. కొద్దిగా కష్టపడితే 42 సీట్లలో గెలుస్తుందట. బలహీనంగా ఉన్న నియోజకవర్గాలు 36 ఉన్నాయట. కాబట్టి చివరి రెండు కేటగిరిల్లోని నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టిపెడితే మంచి మెజారిటితో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని కేసీ చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో తక్కువలో తక్కువ 70 సీట్లలో గెలిచి అధికారంలోకి రావాల్సిందే అని కచ్చితంగా చెప్పేశారు. ఇపుడు కూడా అధికారంలోకి రాకపోతే తెలంగాణాలో పార్టీకి కష్టాలు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వార్నింగులతో సీనియర్లు దారికి వస్తారా ?