సురేష్ చేసిన ఘోరాన్ని కళ్లకు కట్టిన కీర్తన... అంత దారుణంగా...!
గోదావరి బ్రిడ్జి వద్ద జరిగిన ఘోర ఘటనకు సంబంధించి మృత్యుంజయురాలు కీర్తన వివరాలు వెళ్లడించింది.
By: Tupaki Desk | 9 Aug 2023 7:03 AM GMTమహిళను ఇద్దరు కుమార్తెలతో సహా గోదావరి నదిలోకి తోసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కీర్తన అనే బాలిక బ్రతికి బయటపడిన విధానం అందరినీ ఆశ్చర్య పరిచింది! ఈ సమయంలో ఆ రోజు రాత్రి ఏమి జరిగింది.. ఎలా జరిగింది అనే విషయాలపై బాలిక క్లారిటీగా చెప్పింది.
అవును... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గోదావరి బ్రిడ్జి వద్ద జరిగిన ఘోర ఘటనకు సంబంధించి మృత్యుంజయురాలు కీర్తన వివరాలు వెళ్లడించింది. తన తల్లిని, చెల్లిని కాళ్లు పట్టుకుని సురేష్ నదిలోకి నెట్టేశాడని తెలిపింది. తెనాలిలోని తన పెద్దమ్మ సంరక్షణలో ఉన్న బాలిక తాజాగా విలేకర్లతో మాట్లాడింది.
షాక్ నుంచి ఇంకా తేరుకోని బాలిక.. భోరుమంటూనే తన కళ్ల ముందే జరిగిన భయానక దుర్ఘటన గురించి వివరించింది. కారు కొన్నానంటూ సురేష్ తన తల్లి సుహాసినితోపాటు తనను, తన చెల్లి జెర్సీని తీసుకుని బయటకు వెళ్లాడని కీర్తన తెలిపింది. ఈ సందర్భంగా... గోదావరి నదిని చూద్దామని, ఫొటోలు దిగుదామని కారు ఆపాడని చెప్పింది.
అనంతరం జరిగిన సంఘటనను గుర్తుచేసుకుని బోరున విలపించిన ఆ బాలిక... గుండె దిటవు చేసుకుని జరిగిన విషయాన్ని వివరించింది. గోదావరి వంతెన వద్ద ఫోటోలు తీసుకుందామని చెప్పి అక్కడ వంతెన రెయిలింగ్ వద్ద నిలబడి ఉండగా.. తన తల్లి కాళ్లు పట్టుకుని నదిలోకి నెట్టేశాడని కీర్తన తెలిపింది.
అనంతరం ఏడాది వయసున్న తన చెల్లిని నదిలోకి విసిరేశాడని తెలిపింది. ఇదే సమయంలో తనను నెట్టేయగా.. పైపు ఆసరా దొరకడంతో పట్టుకుని ఉన్నట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా 100కు ఫోన్ చేయగా పోలీసు అంకుల్ ఫోన్ చేసి మాట్లాడారని బాలిక వివరించింది.
ఆ సమయంలో పోలీసులు వంతెన వద్దకు వచ్చారని.. హారన్ మోగిస్తూ, వినపడుతుందా అని అడుగుతూ.. నదిలోకి టార్చిలైటు వేశారని తెలిపింది. అనంతరం కనబడుతుందా అని అడుగుతూ విజిల్ వేసుకుంటూ వచ్చి తన ఆచూకీ గుర్తించి కాపాడారని తెలిపింది.