Begin typing your search above and press return to search.

తల్లి ఫ్యాక్టరీ కూలీ... కొడుకు యూకేకు కాబోయే ప్రధాని!

అవును... బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో... బ్రిటన్ తదుపరి ప్రధానిగా ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ బాధ్యతలు చేపట్టనున్నారు.

By:  Tupaki Desk   |   5 July 2024 11:41 AM GMT
తల్లి ఫ్యాక్టరీ కూలీ... కొడుకు యూకేకు కాబోయే ప్రధాని!
X

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో.. ఆ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. ఈ సమయంలో లేబర్ పార్టీ ఘన విజయంతో ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణ ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో... బ్రిటన్ తదుపరి ప్రధానిగా ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... మన దేశాన్ని మీరు మార్చారు.. అందరికీ కృతజ్ఞతలు.. కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం.. దేశ పునరుద్ధరణ దిశగా పని మొదలుపెడ్దాం అని అన్నారు. ఇప్పుడు కీర్ స్టార్మర్ హాట్ టాపిక్ గా మారారు.

1962 సెప్టెంబరు 2న జన్మించిన కీర్ స్టార్మర్‌ బాల్యమంతా లండన్‌ శివారుల్లోనే గడిచింది. ఆయన తల్లి ఓ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసేవారు. ఆ సమయంలో ఆమె ఓ అరుదైన వ్యాధితో బాధపడేవారు. అయినప్పటికీ స్టార్మర్ కష్టపడి చదువుకున్నారు.. కుటుంబంలో తొలిసారి యూనివర్సిటీకి వెళ్లారు.. న్యాయవిద్యను అభ్యసించారు. చదువు పూర్తయిన తర్వాత 2003లో నార్తన్‌ ఐర్లాండ్‌ పోలీసులకు మానవహక్కుల సలహాదారుగా వ్యవహరించారు.

ఈ క్రమంలోనే లేబర్‌ పార్టీ నాయకుడు, ప్రధాని గార్డెన్‌ బ్రౌన్‌ హయాంలో ఇంగ్లాండ్‌, వేల్స్‌ కు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్‌ గానూ పనిచేశారు. ఆ సమయంలో స్టార్మర్ కీలక పనులు చేశారు. ఇందులో భాగంగా... ఖర్చులను దుర్వినియోగం చేసే ఎంపీలు, ఫోన్‌ హ్యాకింగ్‌ కు పాల్పడిన జర్నలిస్టులకు శిక్షలు వేయించారు. దీంతో అప్పట్లో స్టార్మర్ వార్తల్లో నిలిచారు.

ఈ విధంగా తన వృత్తిలో కీలకంగా వ్యవహరిస్తూ ఆయన చేసిన సేవలకు గానూ 2014లో రాణి ఎలిజెబెత్ - 2 నుంచి నైట్ హుడ్ అందుకున్నారు. 2015లో ఎంపీగా గెలిచారు. అయితే.. ఆయన ఎంపీ కావడానికి కొన్ని నెలల ముందే తల్లి దూరమైంది. అయినప్పటికీ ప్రచారంలో యాక్టివ్ గా పాల్గొన్నారు.. గెలిచారు.

ఇలా 2015లో తొలిసారి ఉత్తర లండన్‌ నుంచి పార్లమెంట్‌ కు ఎన్నికయిన ఆయన... 2019లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఆ మరుసటి ఏడాదే లేబర్‌ పార్టీ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఈ పార్టీ 14 ఏళ్ల తర్వాత విజయం సాధించడంతో ప్రధానమంత్రి పదవి అందుకోబోతున్నారు. ఆయన నిర్విరామ ప్రయత్నమే తిరిగి ఆ పార్టీకి విజయం అందించింది!