Begin typing your search above and press return to search.

షాకు సవాలు విసిరిన కేజ్రీవాల్.. అలా చేస్తే ఎన్నికల్లో పోటీ చేయరట

ఇదిలా ఉండగా.. ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర అధికార.. విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.

By:  Tupaki Desk   |   13 Jan 2025 4:43 AM GMT
షాకు సవాలు విసిరిన కేజ్రీవాల్..  అలా చేస్తే ఎన్నికల్లో పోటీ చేయరట
X

ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల గంట మోగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇదిలా ఉండగా.. ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర అధికార.. విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలోని అన్ని మురికివాడల కంటే.. కేజ్రీవాల్ నివసించిన శీష్ మహల్ టాయిలెట్ల ఖరీదే ఎక్కువన్న వ్యాఖ్యను ఆ మధ్యన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోట రాగా.. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నోటి నుంచి వచ్చాయి.

అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ తిప్పి కొట్టారు. అమిత్ షాను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీరు మురికివాడల్ని బాగు చేస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయనని సవాలు విసిరారు. ఢిల్లీలోని మురికివాడల కూల్చివేతలపై కేసులను ఉప సంహరించుకోవటంతో పాటు వారికి పునరావాసం కల్పిస్తే తాను ఎన్నికల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తన మాటలతో సామాన్యులు ఇట్టే కనెక్టు అయ్యేలా మాజీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి.

బీజేపీ అగ్రనాయకత్వంపై విరుచుకుపడిన కేజ్రీవాల్.. ‘‘మీరు మురికివాడల ప్రజలపై నమోదు చేసిన కేసుల్ని ఉపసంహరించుకోండి. దీనిపై కోర్టులో అఫిడవిట్లను దాఖలు చేయండి. ఇళ్లు కోల్పోయిన మురికివాడ ప్రజలందరికి అదే స్థలంలో ఇళ్లు నిర్మించండి. అప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇదే నా సవాలు. మీరు స్వీకరిస్తారా?’ అంటూ కమలనాథుల్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఒకవేళ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మురికివాడల్ని కూల్చేయాలని భావిస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పేదల స్థలాల్ని ఆక్రమించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్న కేజ్రీవాల్.. ‘‘ముందు మీ ఓట్లు కావాలి. తర్వాత మీ స్థలం కావాలి. బీజేపీ నేత్రత్వంలోని కేంద్రం గత ఐదేళ్లలో ఢిల్లీలోని మురికివాడ ప్రజలకు కేవలం 4700 ఫ్లాట్ల మాత్రమే నిర్మించి ఇచ్చిందన్నారు. ‘‘ఢిల్లీ మహానగరంలో నాలుగు లక్షల మందికి పైగా మురికివాడల్లో ఉన్నారు. మీరు అందరికి ఇళ్లు ఇవ్వాలంటే వారికి వెయ్యేళ్లు పడుతుంది. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఏదో హోదాను అనుభవించటానికి కాదు. ప్రజల హోదాను పెంచటం కోసమే’’ అంటూ తన గురించి చెప్పుకొచ్చారు. మరోవైపు బీజేపీ అగ్రనాయకత్వం కేజ్రీవాల్ విమర్శల్ని తిప్పి కొడుతోంది.

దేశంలోని పేదల కోసం ప్రధాని మోడీ 3.58 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తే.. కేజ్రీవాల్ మాత్రం పేద ప్రజల సొమ్ముతో శీష్ మహాల్ ను (అద్దాల మేడ) కట్టుకున్నారంటూ మండిపడుతున్నారు. ఇలా.. ఒకరి మీద మరొకరు పోటాపోటీగా చేసుకుంటున్న విమర్శలు ఢిల్లీ రాజకీయాల్ని మరింతగా వేడెక్కిస్తున్నాయి.మరోవైపు బీజేపీ ఎంపీ.. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రమేశ్ బిధూడీని బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించిందని మాజీ సీఎం కేజ్రీవాల్ పేర్కొంటున్నారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో రమేశ్ తాజాగా స్పందిచారు.

తాను ముఖ్యమంత్రి రేసులో లేనని స్పష్టం చేశారు. బీజేపీ పట్ల తానెంత విశ్వాసంగా ఉంటానో.. ప్రజల పట్ల అంతే విశ్వాసంతో ఉంటానని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థినని ప్రచారం చేస్తున్నారని.. అవేమీ నిజాలు కావన్నారు. తానిప్పటివరకు రెండుసార్లు ఎంపీగా.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. తాను ప్రజల సేవకుడిగా పని చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు.