Begin typing your search above and press return to search.

అమెరికా ఎన్నికల్లో విద్యుత్ ఛార్జీలపై హామీ... కేజ్రీవాల్ రియాక్షన్ వైరల్!

అవును... అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే విద్యుత్ ఛార్జీలు సగానికి తగ్గిస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   11 Oct 2024 3:30 PM GMT
అమెరికా ఎన్నికల్లో విద్యుత్  ఛార్జీలపై  హామీ... కేజ్రీవాల్  రియాక్షన్  వైరల్!
X

ఎన్నికల సమయం వచ్చిందంటే ప్రచార కార్యక్రమాల్లో నేతలు ఇచ్చే హామీలు ఏ స్థాయిలో ఉంటాయనేది తెలిసిన విషయమే. ప్రధానంగా... పేద, మధ్యతరగతి ప్రజానికాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి బలహీనతలను ఓట్ల రూపంలో క్యాష్ చేసుకునే విషయంలో పలువురు పొలిటీషియన్స్ పీహెచ్డీ ని మించి పట్టా పొంది ఉంటుంటారని అంటారు.

హామీలు ఇస్తున్న సమయంలో వాటి అమలు ఏమేరకు సాధ్యం అనే ఇంగితం పూర్తిగా వదిలేస్తుంటారని అంటుంటారు. సరేలే... వారి వద్ద ఏదైనా అద్భుతదీపం ఉందేమో అని నమ్మిన ఆశాజీవులకు ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం 'బొమ్మ' కనిపిస్తుంటుంది. ఇలాంటి ఉదాహరణలు భారతదేశంలో కోకొల్లలు అని చెబుతుంటారు.

మిగిలినవాటి సంగతి కాసేపు పక్కనపెడితే... ఉచిత హామీలకు ఉన్న డిమాండ్ లెక్కే వేరు! ఉచితం అంటే చాలు సాధ్యాసాధ్యాలపై అవగాహన లేకో, ఆలోచన రాకో, ఆ అవసరం లేదనో కానీ... ఓట్లు గుద్దిపడేస్తుంటారని అంటుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలోనూ ట్రంప్ కరెంట్ ఛార్జీలపై ఓ ఆసక్తికర హామీ ఇచ్చారు.

అవును... అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే విద్యుత్ ఛార్జీలు సగానికి తగ్గిస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా.. తాను అధికారంలోకి వచ్చిన 12 నెలల్లో ఇంధన, కరెంట్ బిల్లులు సగానికి తగ్గిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో దేశంలో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని రెట్టింపు చేసేలా చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు.

ఫలితంగా ద్రవ్యోల్బణం తగ్గుతుందని.. ఈ చర్యల వల్ల అమెరికాలో మరి ముఖ్యంగా మిచిగాన్ లో వ్యాపార అవకాశాలు పెరుగుతాయని ట్రంప్ "ఎక్స్" వేదికగా ప్రకటించారు. దీంతో.. ట్రంప్ ఇచ్చిన ఈ హామీపై ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ట్రంప్ పోస్టును రీట్వీట్ చేస్తూ ఓ కామెంట్ పెట్టారు!

ఇందులో భాగంగా.. "విద్యుత్ ఛార్జీలు సగానికి తగ్గిస్తానని ట్రంప్ ప్రకటించారు.. ఉచిత తాయిలాలు అమెరికా వరకూ వెళ్లాయి!" అని పేర్కొన్నారు. దీంతో... ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

కాగా... ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఉచిత కరెంట్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇటీవల ఈ విషయాలపై స్పందించిన కేజ్రీవాల్... ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ను అమలు చేస్తే... ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను మోడీ తరుపున ప్రచారం చేస్తానని వ్యాఖ్యానించారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాకుండా.. డబుల్ ఇంజిన్ సర్కార్ అని బీజేపీ చెప్పుకునే వ్యాఖ్యలను ఎద్దేవా చేశాయనే చర్చ జరిగింది!