కేజ్రీవాల్ అరెస్టు... అమెరికా అలా - అర్ధాంగి ఇలా!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అంశం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 March 2024 11:30 AM GMTఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అంశం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. ఇందులో భాగంగా ఢిల్లీ లిక్కర్ స్కాం లోని నిజానిజాలను తన భర్త మార్చి 28న కోర్టులో బయటపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు! ఇదే సమయలో.. కేజ్రీవాల్ అరెస్ట్ పై అగ్రారాజ్యం అమెరికా కూడా స్పందించింది!
అవును... తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగొచ్చని అంటున్నారు. ఇదే విషయాన్ని వెల్లడించిన కేజ్రీవాల్ సునీత సతీమణి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో భాగంగా తన భర్తను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారని చెబుతూ. ఆయనకు ఆరోగ్యం సరిగా లేదని, డయాబెటిస్ తో బాధపడుతున్నారని, కస్టడీలోనూ ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారని తెలిపారు.
ఇందులో భాగంగా... అక్కడి నుంచే నీటి సమస్యను నివారించడానికి రెండు రోజుల క్రితం మంత్రికి లేఖ పంపారని.. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఒక సమస్యగా మారుస్తోందని.. ఆయనపై కేసులు పెడుతోందని.. ఢిల్లీని నాశనం చేయాలని కోరుకుంటున్నట్లున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో... లిక్కర్ కేసులో ఇప్పటివరకూ సుమారు 250 సార్లకు పైగా ఈడీ సోదాలు జరిపిందని తెలిపిన ఆమె... ఎందులోనూ ఏమీ దొరకలేదని అన్నారు.
ఈ క్రమంలోనే... ఈ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన అన్ని విషయాలను, నిజానిజాలను మార్చి 28న కోర్టులో బయటపెడతానని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారని ఆమె వెల్లడించారు. ఇదే సమయంలో... ఢిల్లీ లిక్కర్ స్కాం డబ్బు ఎక్కడుందో ఆయన కోర్టులో చెబుతారని.. అందుకు తగిన ఆధారాలు కూడా ఆయన ఇస్తారని సీఎం సతీమణి వెళ్లడించారు. దీంతో... ఇప్పుడు ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది.
కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు!:
ఢిల్లీలోని లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ పై ఇతర దేశాలు స్పందించడం ఇప్పుడు వైరల్ గా మారింది. కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారంపై ఇప్పటికే జర్మనీ ఒక ప్రకటన జారీ చేయగా... తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా స్పందించింది. ఇందులో భాగంగా... భారత్ లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని.. ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.
దీంతో ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన భారత్... చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా... ఢిల్లీలోని యూఎస్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా... దౌత్య సంబంధాల్లో ఆయా దేశాల అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని.. తోటి ప్రజాస్వామ్య దేశాల విష్యంలో ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని.. లేదంటే సంబంధాలు దెబ్బతింటాయని విదేశాంగ శాఖ వెల్లడించింది.
కాగా... ఇదే వ్యవహారంపై అమెరికాకంటే ముందు జర్మనీ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... భారత్ ప్రజాస్వామ్యం దేశం అని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులు అని చెబుతూ.. అందుబాటులో ఉన్న చట్టపరమైన అన్ని మార్గాలనూ ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చని తెలిపింది. దీంతో... ఈ విషయంపై సీరియస్ అయిన భారత్... ఆ దేశ రాయబారికి సమన్లు ఇచ్చింది.
కాగా... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 21న కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కస్టడీ రేపటితో (గురువారం) ముగియనుంది. దీంతో అధికారులు ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు!