మంత్రి రిజైన్.. సీఎం పీఎస్ పై వేటు.. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన?
ఢిల్లీ ప్రభుత్వంలో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ ముగ్గురూ జైలు పాలయ్యారు.
By: Tupaki Desk | 12 April 2024 7:18 AM GMTమోదీ ప్రభుత్వం తాము అనుకున్నది నెరవేర్చుకుంటోందా..? పదేళ్లుగా తమ కంట్లో నలుసుగా మారిన ప్రభుత్వాన్ని తొలగించనుందా..? సార్వత్రిక ఎన్నికల ముంగిటనే దీనికి ముహూర్తం పెట్టిందా..? సీఎంను ఇప్పటికే జైలుకు పంపిన మోదీ సర్కారు.. ఆ రాష్ట్ర మంత్రి రాజీనామా వెనుక కూడా ఉందా..? సీఎం వ్యక్తిగత సహాయకుడు తొలగింపు.. ఇవన్నీ దీనినే సూచిస్తున్నాయి. ఇప్పుడు ఆ వాదనను మరింత బలపరిచేలా కీలక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమె చెప్పిందంటే నిజమే?
ఢిల్లీ ప్రభుత్వంలో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ ముగ్గురూ జైలు పాలయ్యారు. మరీ ముఖ్యంగా కేజ్రీవాల్ జైలుకెళ్లాక ఆతిశీ అత్యంత కీలకంగా మారారు. జైలు నుంచి కేజ్రీ తొలి ఆదేశాలుగా చెబుతున్న వాటిని ఈమెనే మీడియాకు వెల్లడించారు. ఇప్పడు ఆతిశీ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ యత్నిస్తోందని వ్యాఖ్యానించారు. కేజ్రీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర సాగుతోందని తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ఆరోపించారు. కాగా, కేజ్రీ ప్రభుత్వం తరఫున ఆతిశీ ఇప్పుడు కీలక విషయాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఆమె చెప్పినవాటిని కాస్త గమనించాల్సి ఉంటుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలనూ పరిగణనలోకి తీసుకుంటే ఆరోపణలు నిజమేనేమో అనిపిస్తుంది.
మంత్రి రిజైన్ తోనే..
ఆప్ ప్రభుత్వం అత్యంత కష్టాల్లో ఉండగా.. ఆ పార్టీకి చెందిన మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేశారు. బుధవారం ఈ పరిణామం జరగ్గా.. రాజీనామాను స్పీకర్ రాజీనామాను స్వీకరించలేదు. అయితే, ఆప్ అవినీతిలో కూరుకుపోయిందని రాజ్ కుమార్ ఆనంద్ తన రాజీనామా సందర్భంగా ఆరోపించారు. పదవికి రాజీనామా చేయడంతో పాటు పార్టీని కూడా వీడారు. ఇక సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) వైభవ్ కుమార్‌ను తాజాగా విధుల నుంచి తొలగించారు. వైభవ్ నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ విభాగం వెల్లడించింది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా.. ఎప్పుడో 2007లో జరిగిన ఘటనను వైభవ్ తొలగింపునకు కారణంగా చూపారు. ఆ ఏడాది విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశారని వైభవ్ పై నోయిడా పోలీసులు కేసు పెట్టారు. కేజ్రీకి పీఎస్ గా నియమించే సమయంలో ఈ కేసు వివరాలను వెల్లడించలేదని తమ దర్యాప్తులో తేలినట్లు విజిలెన్స్ తెలిపింది. అయితే, ఢిల్లీ మద్యం స్కాంలో ఏప్రిల్ 8న వైభవ్ ను ఈడీ ప్రశ్నించడం గమనార్హం. ఇదంతా తమ పార్టీని నాశనం చేసే కుట్ర అని ఆప్ ఇప్పటికే బీజేపీపై ఆరోపణలు చేస్తోంది.