లిక్కర్ కేసు.. జైల్లోనే సీఎం అరెస్టు.. కష్టాలు కంటిన్యూ
ఈ లెక్కన చూస్తుంటే ఆ సీఎం కష్టాలు కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తోంది.
By: Tupaki Desk | 26 Jun 2024 7:27 AM GMTఇప్పటికే అరెస్టయి మూడు నెలలు దాటింది. బెయిల్ వచ్చినా అది ఎన్నికల కోసమే.. కింది కోర్టులో మళ్లీ బెయిల్ మంజూరైనా పై కోర్టు స్టే విధించింది. ఇంతలోనే మరో దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగి జైల్లోనే అరెస్టు చేసింది. ఈ లెక్కన చూస్తుంటే ఆ సీఎం కష్టాలు కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తోంది.
నేడు కీలక పరిణామం?
మద్యం విధానం కేసులో బుధవారం కీలక పరిణామం జరిగేలా కనిపిస్తోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు రానుండడమే దీనికి కారణం. అయితే, దీనికిముందే మరో కీలక పరిణామం జరిగింది. తిహాడ్ జైల్లో ఉన్న ఆయన్ను అక్కడే మంగళవారం సీబీఐ అరెస్టు చేసింది. సోమవారం జైల్లోనే కేజ్రీ స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. కేజ్రీని సీబీఐ బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టనుంది.
బెయిల్ వస్తుందనగా?
వాస్తవానికి మద్యం కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరుచేస్తూ ట్రయల్ కోర్టు గత గురువారం తీర్పునిచ్చింది. ట్రయల్ కోర్టు తమ వాదనలకు తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఈడీ... ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై శుక్రవారం హై కోర్టు మధ్యంతర స్టే విధించింది. దీన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు నిర్ణయం వెలువడ్డాకే తమ తీర్పు ఉంటుందని.. వేచి ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం సూచించింది. దీనిపై బుధవారం విచారణ చేపడతామని తెలిపింది. ఈ క్రమంలో సుప్రీం నుంచి బెయిల్ వస్తుందని ఆప్ వర్గాలు భావించాయి. కానీ, ఇంతలో కేజ్రీని సీబీఐ అరెస్టు చేసింది. బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం సుప్రీంకోర్టు ఏం తీర్పు వెలువరించనుంది అనేది తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.