షేప్ కోసం కేరళ అమ్మాయి దారుణ డైటింగ్.. కట్ చేస్తే విషాదం
ఆమె బరువు అక్షరాల యాభై కేజీలు. కానీ.. ఆమె షేప్ బాగోలేదంటూ కొందరు చేసిన కామెంట్లను సీరియస్ గా తీసుకుంది.
By: Tupaki Desk | 12 March 2025 1:33 PM ISTఆమె బరువు అక్షరాల యాభై కేజీలు. కానీ.. ఆమె షేప్ బాగోలేదంటూ కొందరు చేసిన కామెంట్లను సీరియస్ గా తీసుకుంది. బరువు తగ్గే అంశంపై ఫోకస్ చేసింది. చేస్తున్నది తప్పా? ఒప్పా? అన్నది పట్టించుకోవటం మానేసింది. ఇంట్లో వారి మాటల్ని పెడ చెవిన పెట్టింది. యూట్యూబ్ వీడియోల్ని ఫాలో అవుతూ సొంత డైట్ చేయటం షురూ చేసింది. చివరకు ఆసుపత్రి పాలై.. దారుణ రీతిలో ప్రాణాలు విడిచిన కేరళ అమ్మాయి విషాద ఉదంతం గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.
కేరళలోని కన్నూరు పరిధిలోని కూథుపరంబకు చెందిన శ్రీనంద బరువు కేవలం యాభై కేజీలు మాత్రమే. అయితే.. ఆమె బాడీ షేప్ బాగోలేదని చెప్పే కొందరి మాటలతో కఠినమైన ఆహార నియమాల్ని పాటించటం మొదలు పెట్టింది. పద్దెనిమిదేళ్ల వయసులో బరువు తగ్గటం కోసం అడ్డమైన వీడియోల్ని అనుసరిస్తూ.. వారు చెప్పే సలహాల్ని.. చేసే సూచనల్ని తనకు అన్వయించుకుంది. దీంతో విపరీతమైన ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.
చివరకు ఆసుపత్రికి చేరాల్సి వచ్చింది. ఆమెకు వైద్యం చేసే వైద్యులు సైతం ఆమె పరిస్థితిని చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే.. ఆసుపత్రిలో చేరే నాటికి ఆమె బరువు కేవలం పాతిక కేజీలు మాత్రమే. ఆమె ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయానికి ఆమె బీపీ 70, ఆక్సిజన్ స్థాయి 70-72 గా ఉండటమే కాదు సోడియం.. పోటాషియం లెవల్స్ అతి తక్కువగా ఉన్నట్లుగా ఆమెకు వైద్యం చేసిన వైద్యుడు ప్రభు వెల్లడించారు.
మూడు నెలల వ్యవధిలో యాభై కేజీలు ఉన్న శ్రీనంద.. పాతిక కేజీలకు తగ్గిపోయింది. ఆమె తీరుపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్నెల్ల క్రితం నుంచి బరువు తగ్గే కార్యక్రమాన్ని మొదలు పెట్టిన ఆమె క్రమంగా ఆహారాన్ని తీసుకోవటం మానేసిందని చెప్పారు. మూడు నెలల నుంచి ఆహారం పూర్తిగా బంద్ చేసిన ఆమె.. చివరకు నీళ్లు తాగటం కూడా మానేసినట్లు పేర్కొన్నారు. ఇలా అడ్డదిడ్డమైన వీడియోల్ని చూస్తే.. తన ప్రాణాల్ని తానే పోగొట్టుకున్న ఈ టీనేజర్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.