Begin typing your search above and press return to search.

శ్రుతి జీవితంతో విధి క్రూర నాటకం.. అచ్చం విషాద సినిమా కథే

కేరళలోని వాయనాడ్ లో జూన్ 30న ఏం జరిగిందో అందరూ చూశారు.

By:  Tupaki Desk   |   12 Sep 2024 8:46 AM GMT
శ్రుతి జీవితంతో విధి క్రూర నాటకం.. అచ్చం విషాద సినిమా కథే
X

ఒక్కరాత్రిలో జీవితాలు తలకిందులు కావడం అంటే ఇదేనేమో..? అప్పటివరకు మనకు అండగా ఉన్న ప్రకృతి పగబట్టినట్లు విరుచుకుపడడం ఏమిటో..? అమ్మానాన్నతో పాటు కుటుంబంలోని 9 మందిని బలిగొనడం ఏమిటో? దాన్నుంచి కోలుకునేలా చేసి.. జీవితంలో నాలుగు అడుగులు వేసేలా భరోసాగా ఉన్న వ్యక్తినీ బలిగొనడం ఏమిటో..? అచ్చం సినిమా కథను తలపించే ఇదంతా కేరళ వరద బాధితురాలి విషయంలో జరిగింది.

ఇంతకంటే విషాదం ఉంటుందా..

కేరళలోని వాయనాడ్ లో జూన్ 30న ఏం జరిగిందో అందరూ చూశారు. ఎడతెరిపి లేని వర్షాలతో కొండచరియలు విరిగిపడి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చూరాల్‌ మల గ్రామానికి చెందిన శ్రుతి (24) కుటుంబమూ ఉంది. ఈమె అమ్మానాన్నతో పాటు 9 మందిని కోల్పోయింది. అయితే, దీనికి ముందే జూన్ 2న శ్రుతికి జెన్సన్‌ (27)తో పెళ్లి కుదిరింది. వాస్తవానికి వీరి మతాలు వేరు. కానీ, పెద్దల అంగీకారం కుదిరింది. అయితే, అదే పెద్దల్లోని శ్రుతి కుటుంబం మాత్రం ఆ తర్వాత వీరి వివాహాని చూడలేకపోయింది. కారణం.. ప్రకృతి విలయతాండవం.

జూన్ 30న వచ్చిన వరదలతో కొండచరియలు విరిగిపడి శ్రుతి అమ్మానాన్న, సోదరితో పాటు 9 మంది చనిపోయారు. ఇంతటి తీవ్ర దు:ఖాన్ని ఆమె జెన్సన్‌ సాయంతో అధిగమించింది. శ్రుతికి అండగా నిలిచేందుకు అతడు ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. వరద బాధిత ప్రాంతాల పర్యటనకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు వీరు కలిసే మాట్లాడారు. ఇదంతా జాతీయ మీడియాలో వచ్చింది. ఈ జంట గుండె ధైర్యాన్ని ప్రశంసిస్తూ కథనాలు వచ్చాయి. శ్రుతి కుటుంబ సభ్యులకు నివాళులర్పించేందుకు శ్మశాన వాటికకు వచ్చి.. సమాధుల మధ్యే జీవితాంతం తోడుంటామని ప్రమాణం చేశారు. ఈ నెలలో నిరాడంబరంగా రిజిస్టర్డ్ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.

ఆమె ఒకటి తలిస్తే.. విధి మరోలా

శ్రుతి అంతా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిద్దామని అనుకుంటుండగా.. విధి మరోలా తలచింది. జెన్సన్‌ (27) అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మంగళవారం శ్రుతి, జెన్సన్‌ ఇతర కుటుంబ సభ్యులు వ్యానులో వెళ్తుండా కోజికోడ్‌-కొల్లేగల్‌ జాతీయ రహదారిపై వీరి వాహనం, ప్రైవేట్‌ బస్సు ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన జెన్సన్.. ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయాడు. శ్రుతితో పాటు మిగతావారికి స్వల్ప గాయాలయ్యాయి.