భార్య ఫోన్ కు కిస్ ఎమోజీ..ఇద్దరినీ దారుణంగా చంపిన భర్త!
కేరళలోని పతనంతిట్ట జిల్లా కలంజూరు గ్రామంలో బైజు(30), వైష్ణవి(28) అనే దంపతులు ఉండేవారు.
By: Tupaki Desk | 4 March 2025 6:00 PM ISTస్మార్ట్ ఫోన్ వచ్చాక క్రైం రేటు మరింత పెరిగిపోయింది. వాట్సాప్ చాటింగ్ లు, కాలింగ్ లు, సోషల్ మీడియా షార్ట్స్, రీల్స్..ఇలా చెప్పుకుంటూ పోతే జనాలకు ఎంటర్ టైన్ మెన్ ఇవ్వడమే కాదు అనవసరపు అపోహలను పెంచుతున్నాయి. అలాగే ‘అక్రమ’ బంధాలతో కుటుంబ బంధాలు తెగిపోతున్నాయి. సెల్ ఫోన్ ప్రతీ ఒక్కరి చేతుల్లోకి వచ్చి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కొందరు ఆకతాయిలు చాటింగ్ పేరిట మహిళలను వేధిస్తున్నారు. ఇలా ఎన్నో రకాలుగా స్మార్ట్ ఫోన్ కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. స్మార్ట్ ఫోన్ చాటింగ్ లు ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇలాంటిదే కేరళలోనూ జరిగింది. ఓ భర్త ఇద్దరు వ్యక్తులను చంపిన ఘటన సంచలనం రేపింది.
కేరళలోని పతనంతిట్ట జిల్లా కలంజూరు గ్రామంలో బైజు(30), వైష్ణవి(28) అనే దంపతులు ఉండేవారు. వీరికి పదేళ్లు, ఐదేళ్ల వయస్సుకన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పక్కనే విష్ణు(30) అనే వ్యక్తి తన తల్లితో కలిసి ఉంటున్నాడు. విష్ణు, బైజుతో కలిసి రోజు పనికి వెళ్లేవాడు. రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండేవి. విష్ణు, బైజు ఫ్రెండ్స్ గా ఉండేవారు. ఈక్రమంలోనే రీసెంట్ గా వైష్ణవికి వాట్సాప్ లో విష్ణు కిస్ ఎమోజీ పంపించాడు. దీన్ని చూసిన బైజు తీవ్ర కోపంతో రగిలిపోయాడు. ఇంట్లో ఉన్న కొడవలి తీసుకుని భార్యపై దాడికి ప్రయత్నించాడు. భయంతో ఆమె పక్కనే ఉన్న విష్ణు ఇంట్లోకి పారిపోయింది.
దీనికి మరింత కోపద్రిక్తుడైన బైజు అదే కొడవలితో విష్ణు ఇంటికి వెళ్లి..భార్యను బయటకు రావాలని కోపంతో అరిచాడు. ఆమె బయటకు రాలేక బిక్కు బిక్కుమంటూ భయంతో లోపలే ఉండిపోయింది. దీంతో బైజూనే ఇంట్లోకి చొరబడి..వైష్ణవిని పెరట్లోకి లాక్కెళ్లి కొడవలితో విచక్షణారహితంగా నరికాడు. అడ్డు వచ్చిన విష్ణును సైతం కొడవలితో దారుణంగా నరికాడు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
దాడి అనంతరం బైజు తన ఇంటికి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. తన స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. దీంతో ఆ స్నేహితుడు పోలీసులకు ఫోన్ చేసి హత్యల విషయం తెలిపాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతకుముందే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు విష్ణు, వైష్ణవిలను ఆస్పత్రికి తరలించగా..వారు మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.
వాట్సాప్ కిస్ ఎమెజీ ఇద్దరి ప్రాణాలను బలిగొనడం స్థానికంగా అందరినీ కలిచివేసింది. స్నేహితుడి భార్యపై విష్ణు కన్నేసి కిస్ ఎమోజీ పంపించాడా? లేదా విష్ణు, వైష్ణవి మధ్య ఏదైనా సంబంధం ఉందా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.