Begin typing your search above and press return to search.

ఇదెక్కడి కోడి రా బాబూ.. ఆర్డీవోకు ఫిర్యాదు..

కొంచెం తిక్కలోడా ఏంటి అని కంగారుపడకండి.. ఆ కోడి నిద్ర చెడగొడుతోందని ఆ మహానుభావుడు చేసిన పని వైరల్ అయ్యింది.

By:  Tupaki Desk   |   19 Feb 2025 7:30 PM GMT
ఇదెక్కడి కోడి రా బాబూ.. ఆర్డీవోకు ఫిర్యాదు..
X

కోడి కూస్తే నిద్రలేస్తాం.. అదే కోడి నస పెడితే కూర వండుకొని తింటాం.. వీడెవడు రా బాబు.. కోడిపై ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు. కొంచెం తిక్కలోడా ఏంటి అని కంగారుపడకండి.. ఆ కోడి నిద్ర చెడగొడుతోందని ఆ మహానుభావుడు చేసిన పని వైరల్ అయ్యింది.

కేరళలోని పల్లిక్కల్ గ్రామంలో ఓ కోడి అరవడంతో ఒకతని నిద్రకు భంగం కలగడం ప్రారంభమైంది. పొద్దున 3 గంటలకు అదే పనిగా కూస్తూ నిద్రను భంగం కలిగిస్తోందంటూ రాధాకృష్ణ కురూప్ అనే వ్యక్తి స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి వద్ద ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

-అసహనానికి కారణమైన కోడి

రాధాకృష్ణ కురూప్ గత కొంతకాలంగా ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నట్లు తెలిపారు. కోడి అరవడం వల్ల నిద్రలేమితో బాధపడుతున్నానని, దీని ప్రభావం తన ఆరోగ్యంపై కూడా పడుతోందని ఆయన వాపోయారు. ప్రశాంతమైన జీవితానికి ఇది అంతరాయం కలిగిస్తోందని, అధికారులే న్యాయం చేయాలని కోరారు.

-అధికారుల స్పందన

ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఆర్డీవో వెంటనే రాధాకృష్ణ ఇంటికి వెళ్లి పరిశీలన చేశారు. ఆయన పక్కింటి మేడపై కోళ్ల షెడ్డు ఉండటాన్ని గమనించారు. వెంటనే కోడి యజమానిని సంప్రదించి, 14 రోజుల్లో కోళ్ల షెడ్డు ఇతర ప్రాంతానికి మార్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

- సామాజిక మీడియాలో కామెంట్స్ వెల్లువ

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు రాధాకృష్ణకు మద్దతుగా నిలుస్తూ, శాంతిని భంగం చేసే శబ్దాలపై చర్యలు తీసుకోవడం అవసరమని అంటున్నారు. మరికొందరు మాత్రం ఇది హాస్యాస్పదమైన ఫిర్యాదని, గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల అరవడం సహజమని చెబుతున్నారు.

ఇలా ఒక సాధారణ సమస్య పెద్ద వివాదంగా మారింది. ఇప్పుడు కోడి యజమాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది వేచిచూడాలి.